అమలాపురం రూరల్: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి 58 రోజుల పాటు కఠిన నిరాహార దీక్షకు పూని ఆత్మ బలిదానం చేసిన మహోన్నత వ్యక్తి అమర జీవి పొట్టి శ్రీరాములని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ప్రసంగిస్తూ తెలుగు మాట్లాడే వారందరికీ ఒక ప్రత్యేక గుర్తింపును, రాష్ట్రాన్ని అందించిన ఆయన త్యాగం అజరామరం అన్నారు. గాంధేయవాదిగా ఆయన చూపిన పట్టుదల, సత్యం, అహింస మార్గాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ టి. నిషాంతి, తహసీల్దార్ వీఎస్ దివాకర్, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో ఎస్పీ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కార్యాలయ సిబ్బంది ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


