మన తెలుగు.. దివ్యమై వెలుగు
● ఆకాంక్షించిన ప్రముఖులు
● అమలాపురంలో
తెలుగు మహాసభలు ప్రారంభం
అమలాపురం రూరల్: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట, తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటుతూ సాగిన ప్రసంగాలు, పద్యాలు, తెలుగు గొప్పతనాన్ని తెలియజేస్తూ విద్యార్థుల నృత్యాలు, పాటలు, కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన బొమ్మల ప్రదర్శనలతో అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో మూడో తెలుగు మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సభలకు ప్రవచన కర్తలు, సినీ రచయితలు, వివిధ రంగాలలో ప్రముఖులు హాజరయ్యారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్‌మాధవ్, మాజీ ఎంపీ తులసి రెడ్డి, సినీ నటుడు తనికెళ్ల భరణి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
తెలుగుకు ఎంతో ప్రత్యేకత
గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ ప్రపంచ భాషలలో తెలుగుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రసంగిస్తూ తెలుగు భాష మన ఆత్మగౌరవమన్నారు. పిల్లలకు అమ్మ భాషలోని తియ్యదనాన్ని రుచి చూపించడం మన బాధ్యత అన్నారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణ దిశగా పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మన భాషను కాపాడుకుంటూ, భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడాలని, మన సంస్కృతిని గౌరవించాలని పిలుపునిచారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యాబోధనంతా తెలుగు మాధ్యమంలోనే జరగాలని సభలో తీర్మానించిందన్నారు. ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తూ తెలుగు భాష ఔన్నత్యం, ప్రాచీన సాహిత్యం, జానపద సంస్కృతిని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నారు. చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ తల్లి భాష అయిన తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, మన గత సంస్కృతి, సంప్రదాయం, చైతన్యానికి ప్రతీకన్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను ఆధునిక ప్రపంచ సందర్భానికి అనుగుణంగా నేర్చుకుని, విస్తృత ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు. దాట్ల సుబ్బరాజు, వేగుళ్ల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, సోము వీర్రాజు, గోపీరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కిమ్స్ ఎండీ కె.రవి కిరణ్ వర్మ, సినీ నటి హేమ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక, కవి సమ్మేళనాలు
తెలుగు మహాసభల సందర్భంగా సాహితీ చర్చలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాల్య దశలోనే పిల్లల్లో ఆసక్తి, మక్కువ పెంపొందించాలనే లక్ష్యలతో ఈ సంవత్సరం కోనసీమ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు. తెలుగు సాహిత్య, సాంస్కతిక అంశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం, పద్య పఠనం, విశిష్ట నేషధారణ ఏకం విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు నగదు ప్రదానం చేశారు. తెలుగు చలనచిత్ర గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మన తెలుగు.. దివ్యమై వెలుగు


