నేడూ విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు
అమలాపురం రూరల్: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం కూడా విద్యుత్ బిల్లులు యథాతథంగా చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్.రాజేశ్వరి తెలిపారు. అదే విధంగా సెక్షన్ ఆఫీస్ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరారు.
ఏడు ప్రైవేట్ బస్సులపై కేసులు
రావులపాలెం: మండలంలోని ఈతకోట టోల్ ప్లాజా వద్ద శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడు బస్సులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా రవాణాఽధికారి డి.శ్రీనివాసరావు తెలిపారు. వాటికి రూ.1.43 లక్షల అపరాధ రుసుము విధించామన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో
ఆరోగ్యకర పంటలు
అంబాజీపేట: సహజ సిద్ధమైన, ఆరోగ్యకర పంటలను పండించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.శ్రీనివాస్ అన్నారు. పి.గన్నవరం డివిజన్ మాస్టర్ ట్రైనర్ జె.నాగవేణి ఆధ్వర్యంలో శనివారం ముక్కామలలో ప్రకృతి వ్యవసాయ కషాయాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలను నాశనం చేస్తున్న పురుగుల నివారణకు సహజ సిద్ధమైన కషాయాలను వాడాలన్నారు. దీని వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తక్కువ పెట్టుబడితో ప్రకృతి కషాయాలను తయారు చేసుకుని, వినియోగించడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కషాయాలను తయారు చేయడం, వాటిని డ్రోన్ సాయంతో పిచికారీ చేయడాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు వివరించారు.
క్షేమంగా ఇంటికి చే రిన బాలిక
అమలాపురం టౌన్: ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరింది. పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల అమలదాసు హసిత ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి ట్యూషన్‌కు బయలుదేరి అదృశ్యమైంది. ఆమె అమలాపురం ఆర్టీసీ బస్ స్టేషన్ వచ్చి కాకినాడ నాన్ స్టాప్ బస్సు ఎక్కింది. కాకినాడలో ఆ రోజు రాత్రి, మర్నాడు పగలు గడిపింది. సాయంత్రం 5.53 గంటలకు కాకినాడ ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బాలిక ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆమె మనసు మార్చుకుని తిరిగి అమలాపురం వచ్చేయాలని అనుకుంది. దీంతో కాకినాడలో నాన్ స్టాప్ బస్సు ఎక్కి అమలాపురం చేరింది. బస్ స్టేషన్‌లో పట్టణ సీఐ వీరబాబు, పట్టణ ఎస్సైలు ఎన్‌ఆర్ కిశోర్ బాబు, టి.శ్రీనివాస్, కె.మనోహర్ జోషి ఆ బాలికను పట్టుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా.. బాలిక అదృశ్యమైనప్పటికీ నుంచి పోలీసులు ముమ్మరంగా దర్యాప్త చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా ఆ బాలిక కాకినాడ వెళ్లినట్టు గుర్తించారు.
తపోవనాన్ని సందర్శించిన
శారదా పీఠాధిపతి
తుని రూరల్: తుని మండలం కుమ్మరిలోవ తాండవ నదీతీరంలో ఉన్న సచ్చిదానంద తపోవనం ఆశ్రమాన్ని విశాఖపట్నానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి శనివారం సందర్శించారు. ఇటీవల శివైక్యం చెందిన తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి సమాధి వద్ద నివాళులు అర్పించారు. వేద విద్యార్థులను, వేద పండితులను కలుసుకుని సరస్వతీ మహాస్వామి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను తెలుసుకున్నారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, భక్తులు పాల్గొన్నారు.
నేడూ విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు


