వాడపల్లికి భక్తుల తాకిడి
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, తొలి హారతి నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యా స్నానాలు ఆచరించి క్యూ లో నిలబడి గోవింద నామాలు చెబుతూ మాడవీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలకు దాతలు సమకూర్చిన ఎలక్ట్రిక్ వాహనాలపై కొత్త వంతెన నుంచి స్వామి వారి ఆలయానికి చేర్చారు. సుమారు లక్ష మంది స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి రూ.68,34,622 ఆదాయం వచ్చినట్టు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్.చక్రధరరావు తెలిపారు. రాత్రి ధర్మపథం కార్యక్రమంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన అలరించింది. ఆలయ చైర్మన్ ఎం.వెంకటరాజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కోల్‌కతా టు కన్యాకుమారి
సైకిల్ యాత్ర
ఐ.పోలవరం: స్వామి వివేకానంద భావజాలాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఒక వ్యక్తి కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌పై సాహస యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం రాత్రి ఐ.పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వరస్వామివారిని దర్శించేందుకు వచ్చారు. కోల్‌కతాకు చెందిన సంజీత్ మజుందార్ జనవరి 26న బయలుదేరి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి శుక్రవారం రాత్రి మురమళ్లకు చేరుకున్నారు. అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టానని, తిరిగి కోల్‌కతాకు సైకిల్‌పై వెళతానన్నారు. తొమ్మిది రాష్ట్రాల మీదుగా సుమారు ఐదు వేల కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందన్నారు. రోజుకు సగటున 50 కిమీల మేర తన యాత్ర సాగుతోందని తెలిపారు. ప్రతి చోట స్థానికులు ఆదరిస్తున్నారని, తన యాత్ర గురించి తెలిసి అభినందిస్తున్నారని తెలిపారు.
కాశీ, అయోధ్యకు
సూపర్ లగ్జరీ బస్సు
రావులపాలెం: స్థానిక డిపో నుంచి కాశీలోని నూతన కాశీ విశ్వేశ్వర మందిర దర్శనానికి, అయోధ్యకు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ శనివారం తెలిపారు. ఈ బస్సు మార్చి మూడో తేదీన బయలుదేరి భువనేశ్వర్‌లోని లింగరాజ స్వామి ఆలయం, పూరీ జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, జాజిపూర్ గిరిజాదేవి శక్తి పీఠం, అలహాబాద్‌లోని త్రివేణి సంగమం, ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం, కాశీ క్షేత్రం – కాశీ విశ్వేశ్వరజ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తి పీఠం, అయోధ్య బాల రాముని ఆలయం, నైమి శారణ్యం– గోమతి నది స్నానం, లలితా దేవి ఉపశక్తి పీఠం, గయ– విష్ణు పాద ఆలయం, బు ద్ధగయ– గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం, శ్రీకూర్మం –కూర్మనాథ దేవాలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయం దర్శనం అనంతరం 16 తేదీన రావులపాలెం చేరుతుందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్‌తో కలిపి టికెట్ ధర రూ.13 వేలుగా నిర్ణయించామన్నారు. వివరాలకు అసిస్టెంట్ మేనేజర్‌ను 73829 11871 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
బాలాజీ క్షేత్రంలో
భక్తజన కోలాహలం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి క్షేత్రం మాఘమాసం శనివారం సందర్భంగా కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉభయ దేవేరులతో కొలువై ఉన్న శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,09,353 ఆదాయం వచ్చిందని ఈఓ రాంబాబురెడ్డి తెలిపారు. స్వామి వారిని 8,500 మంది దర్శించుకున్నారని, మూడు వేల మంది స్వామి అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.1,12,691 విరాళాలుగా అందించారని తెలిపారు.
వాడపల్లికి భక్తుల తాకిడి


