
దసరాల్లో అల్లల్లాచ్చికి..!
● ఉరుకుల జీవితం నుంచి ఊళ్లకు సరదాగా
● కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి పర్యటనలు
● చిన్నా, పెద్దా తారతమ్యం
లేకుండా ఉల్లాసంగా పయనం
● సెలవులు సద్వినియోగం
రాయవరం: జీవితం ఉరుకుల పరుగులమయమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఎన్నో ఒత్తిళ్లు.. ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి. పిల్లల పుస్తక పోరాటం మరీను. పాఠశాల.. అనంతరం హోంవర్క్ పేరుతో రాత్రంతా మేల్కొని ఉండడం. అందరికీ కాస్త విరామం దొరికేది సెలవుల్లోనే. ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చి ఓ మంచి ఆరామాన్ని ఎంచుకుని రిఫ్రెష్ అవ్వాలని చూస్తుంటారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లే వారు కొందరైతే, మరికొందరు, దేశ, విదేశాల్లో విహరించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు 10 రోజుల పైబడి రావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావాసులు ఎటువంటి ప్రదేశాలకు వెళ్తున్నారో ‘సాక్షి’ కథనం.
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం కోసం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎన్నో ఆలయాల్లో దైవ దర్శనాలు చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతతో పాటు మనసు కుదుట పడుతుందని పలువురు భావిస్తున్నారు. అలాగే ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే పాపికొండలు, మారేడుమిల్లి, రంపచోడవరం, సముద్ర తీరప్రాంతాలైన కాకినాడ, అంతర్వేది బీచ్ వంటి ప్రదేశాలతో పాటుగా, ఇతర జిల్లా, రాష్ట్రాల్లోని అరకు, నాగార్జునసాగర్, తమిళనాడు, కేరళ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆహ్లాదకర ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు పయనమవుతున్నారు. ఇక రిజర్వేషన్లు సహకరిస్తే వారణాసి, అయోధ్య వంటి ప్రాంతాలకు కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరికొందరు సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్, థాయ్‌లాండ్ వంటి దేశాలను చుట్టి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ముందుగానే
ప్లాన్ చేసుకుంటాం
ఏటా దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు తప్పనిసరిగా టూర్ వెళ్తాం. ఓసారి ఆధ్యాత్మికం, ఓసారి ఆహ్లాదకర టూర్స్ చేస్తుంటాం. ఈసారి దసరా సెలవుల్లో ముంబై, పూణే ప్రదేశాలు చూసేందుకు వెళ్తున్నాం. మిత్రులతో కలసి పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తున్నాం. ఈ పర్యటనలతో ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాం.
– పితాని శ్రీనివాస్,
టీచర్, జెడ్పీహెచ్‌ఎస్,
కె.గంగవరం మండలం
కొత్త విషయాలను తెలుసుకుంటాం
ఏటా పర్యాటక ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో వెళ్తుంటాను. వీటి ద్వారా పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుతున్నట్లవుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. తెలుసుకున్న విషయాలను పాఠశాలల్లో చిన్నారులకు ఫొటోలు, వీడియోలు చూపించి, అక్కడ విషయాలను తెలియజేస్తాను.
– నయనాల శ్రీనివాసరావు,
స్కూల్ అసిస్టెంట్,
వీరవల్లిపాలెం,
అయినవిల్లి మండలం.
చిక్‌మగుళూర్ వెళ్తున్నా
ప్రతిసారి సెలవులకు విహారయాత్రకు వెళ్లడం అలవాటు. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, ఒడిశాలోని కోణార్క్ టెంపుల్, కర్ణాటకలోని హంపి, బాదామి, పట్టడికల్ వంటి చారిత్రక ప్రదేశాలు తిలకించాం. ఈసారి దసరా సెలవులకు చిక్‌మగుళూర్ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి హిల్ స్టేషన్‌కు కారులోనే వెళ్తున్నాం.
– జానా సురేష్‌కుమార్, ఎస్‌జీటీ, వల్లాయిచెరువు, పెదగాడవిల్లి, ఉప్పలగుప్తం మండలం
బ్యాంకాక్ పర్యటన
మరువలేనిది
మిత్రులతో కలసి చేసిన బ్యాంకాక్ పర్యటన సరికొత్త అనుభూతులనునిచ్చింది. అక్కడ సముద్రంలో అరగంట ప్రయాణించిన తర్వాత సముద్రం లోపల ఉన్న మ్యూజియంలో రకరకాల చేపలు చూసి ఆశ్చర్య పోవాల్సిందే. అలాగే బౌద్ధ దేవాలయాలు కూడా చూడముచ్చటగా ఉంటాయి. బోట్ రైడింగ్, వాటర్‌లో స్కై డైవింగ్ వంటి అంశాలు మరపురానివి.
– సాపిరెడ్డి విశ్వనాథ బాలాజీ (దొరబాబు), యర్రపోతవరం, కె.గంగవరం మండలం
‘ఏరా.. హోంవర్క్ చేశావా.. లేదా.. గెటౌట్ ఫ్రం క్లాస్ రూం’.. ఓ పిల్లాడిపై మాస్టారి అరుపు. ‘ఏవండీ ఆ ఫైల్ రెడీ అయ్యిందా.. ఇంకా ఎంతసేపండీ ఫైవొక్లాక్‌కి జీఎంతో మీటింగ్ ఉంది.. స్పీడుగా కానియ్యండి’.. ఓ ఉద్యోగిపై ఆయన బాస్ అదిలింపు. ఏమేవ్.. లంచ్‌బాక్స్ రెడీ అయ్యిందా.. క్యాబ్ వచ్చేసింది..’ ‘ఆ.. ఇదుగో వచ్చేస్తున్నానండీ.. అయిపోయింది..’ ఓ భార్యాభర్తల ఉదయపు హడావిడి.. పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు ఆ పనులవ్వకపోతే భూమి బద్దలైపోతుందన్నట్టు ప్రతి చోటా ఇవే అరుపులు కేకల జీవితం. ఏ ఉదయమూ మృదువైన సంభాషణలు మచ్చుకు కూడా వినపడని రోజుల్లోకి వెళ్లిపోయారు మనుషులు. ఆ ఉరుకుల పరుగుల జీవితాలకు రీచార్జింగే సెలవులు. ఎక్కడో బద్ధకిష్టులు తప్ప అత్యధికులు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అటో.. ఇటో.. ఎటో పిల్లా పాపలతో బయటకు అలా అలా తిరిగొచ్చేవారే. ఇదిగో దసరా సెలవులొచ్చాయిగా.. మనవాళ్ల ప్రణాళికలేంటో చూసొచ్చేద్దామా..
పర్యాటక వాహనాలకూ డిమాండ్
ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాలను, ఇతర జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఒక రోజులో సందర్శించి వస్తున్నారు. సొంత కార్లు ఉన్నవారే కాకుండా.. మరికొందరు రోజువారీగా అద్దె వాహనాలపై పర్యాటక ప్రాంతాల్లోని అందాలు చూసి వస్తున్నారు. మరికొందరు క్రూజ్ టూర్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. సముద్రంలో ఓడలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. విశాఖపట్నం నుంచి చైన్నె, శ్రీలంక, అండమాన్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

దసరాల్లో అల్లల్లాచ్చికి..!

దసరాల్లో అల్లల్లాచ్చికి..!

దసరాల్లో అల్లల్లాచ్చికి..!

దసరాల్లో అల్లల్లాచ్చికి..!

దసరాల్లో అల్లల్లాచ్చికి..!