
రణభేరి విజయవంతం
● యూటీఎఫ్ జిల్లా నేతలు
● పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్
అమలాపురం టౌన్: విద్యా రంగ సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ చేపట్టిన రణభేరి జాతా జిల్లాలో విజయవంతం అయ్యిందని ఆ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు అన్నారు. జాతా రెండు రోజుల పాటు జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటించిందని పేర్కొన్నారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌తో పాటు రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, అంబాజీపేట, మామిడికుదురు, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, రావులపాలెం తదితర ప్రాంతాల్లో జాత పర్యటించిందన్నారు. జాతా గురువారం సాయంత్రం రావులపాలెం నుంచి సిద్ధాంతం వంతెన మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి గురువారం సాయంత్రం ప్రవేశించిందని చెప్పారు. జాతాలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు ఎస్.జ్యోతిబసు, అరుణకుమారి, టీవీవీజీఆర్ చక్రవర్తి పాల్గొని జాతా వెళ్లిన ప్రతి ప్రాంతంలో ప్రసంగించారు. ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలని, బోధనేతర భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బోధనేతర పనులన్నింటినీ బాయ్‌కాట్ చేస్తామని రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ జాతాలో దాదాపు 500 మంది యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లా యూటీఎఫ్ ప్రతినిధులు పెంకే వెంకటేశ్వరరావు, జీవీ రమణ, కేశవరావుతో పాటు జిల్లాలోని ఆయా మండలాల యూటీఎఫ్ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.