వాహన మిత్ర ఖేదం! | - | Sakshi
Sakshi News home page

వాహన మిత్ర ఖేదం!

Sep 19 2025 2:09 AM | Updated on Sep 19 2025 2:09 AM

వాహన

వాహన మిత్ర ఖేదం!

చిత్తశుద్ధి లోపించిన కూటమి సర్కార్‌

రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయక సమస్య

అయోమయంలో ఆటో డ్రైవర్లు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అందరికీ లబ్ధి

కొత్తపేట/అమలాపురం టౌన్‌: రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వాహన మిత్ర లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. వాహనాలు విక్రయించినప్పటికీ యజమాని పేరు ఆన్‌లైన్‌లో మారకపోవడం ఆ పథకానికి అనర్హులై ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేసి తమను ఆదుకుందని, ఈ కూటమి ప్రభుత్వం మెలిక పెట్టడం వల్లో, నిర్లక్ష్యం వల్లో తమకు ఆ లబ్ధి అందడం లేదని వారు వాపోతున్నారు.

ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాహన మిత్ర పథకాన్ని 2018 మే 14న ఏలూరులో ప్రకటించారు. ఆ హామీ మేరకు 2019లో అధికారం చేపట్టి ఆ పథకాన్ని ప్రకటించిన ఏలూరులోనే అక్టోబర్‌ 4న ఆ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌లు కలిగి ఉన్న స్వయం ఉపాధి డ్రైవర్ల వాహనాల నిర్వహణ, బీమా, ఇతర ఖర్చులకు రూ.10 వేలు సాయంగా దోహదపడింది.

కూటమి పాలనలో వాహనాలకు బ్రేకులు

సీ్త్ర శక్తి (ఉచిత బస్సు) పథకం ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఆ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు లేనిపోని నిబంధనలు అమలు చేస్తూ అర్హులను అనర్హులను చేస్తున్నారని పలువురు వాపోయారు. గత ప్రభుత్వం అమలుచేసిన ఈ పథకంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారంతా విమర్శిస్తున్నారు. ఆ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన తమకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని డ్రైవర్లు పోతున్నారు. బుధవారం నుంచి వాహన మిత్ర పథకానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. కాగా దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వాహన యజమానులకు ఆయా గ్రామ సచివాలయాల్లో వారి వాహనం వేరొకరి పేరున చూపిస్తోందని అక్కడి సిబ్బంది చెప్పడంతో వారు అవాక్కవుతున్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారుల జాబితానే రవాణాశాఖ యంత్రాంగం అప్‌లోడ్‌ చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌, ఆధార్‌ సీడింగ్‌ చేయించుకున్నప్పటికీ ఆ జాబితా అప్‌లోడ్‌ చేయకుండా తమ వాహనం వేరొకరు పేరున ఉన్నట్టు జాబితాలో చూపడంపై సదరు అధికారులు తీరును డ్రైవర్లు తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లబ్ధి పొందిన సుమారు 28 వేల మంది జాబితాలో కొందరు వాహనాలను విక్రయించినా పాత జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలకు అందించడం వల్ల ఈ పథకానికి అర్హత కోల్పోయినట్టు వారంటున్నారు. బుధవారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించి, 22 నుంచి పరిశీలన పూర్తిచేసి 24న తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్‌ రూపొందించారు. ఆ మేరకు లబ్ధిదారులకు అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ గందరకోళ పరిస్థితుల్లో పథకం దరఖాస్తులకు గడువు పెంచి, తాజా జిబితాను రవాణా శాఖ నుంచి తెప్పించి గ్రామ, వార్డు సచివాలయాలకు అందచేయాలని కోరారు.

యంత్రాంగం కసరత్తు

ఓ పక్క రిజిస్ట్రేషన్లకు గడువు విధించడం, మరో పక్క పాత వాహన మిత్ర డేటాతో కొత్త వారికి రిజిస్ట్రేషన్లు కాకపోవడంపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఈ సాఫ్ట్‌వేర్‌ను విజయవాడలో గురువారం అప్‌డేట్‌ చేయడంలో తెగ కసరత్తు చేస్తున్నారు.

తాజా రిజిస్ట్రేషన్లకే ఇబ్బంది

గత వాహన మిత్రలో లబ్ధి పొంది నేటికీ ఆటోల నిర్వహణ రంగంలో ఉన్న వారికి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కాగా ఏడాదిన్నర కాలంలో కొత్తగా ఆటోలను కొనుక్కుని ఈ రంగంలోకి వచ్చిన వారి పేర్లు మాత్రం రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. గతంలో వాహన మిత్ర పథకం కింద జిల్లాలో 4,500 మంది లబ్ధి పొందారు. ఇందులో దాదాపు 2 వేల మంది వరకూ ఈ రంగం నుంచి తప్పుకోవడంతో ఈ సమస్య అనివార్యమైంది. ఉదాహరణకు అమలాపురం మండలం పేరూరు గ్రామ సచివాలయానికి ఐదుగురు ఆటో డ్రైవర్లు రిజిస్ట్రేషన్‌ కోసం బుధవారం వెళ్లారు. వారు గత ఏడాదిన్నర కాలంలో ఆటోల నిర్వహణ రంగంలోకి రావడంతో వారి పేర్లు డేటాలో కనిపించక కంగారు పడ్డారు. పరివాహన్‌ సాఫ్ట్‌వేర్‌ మార్చి డేటా అప్‌లోడ్‌ చేస్తే కానీ కొత్తవారికి రిజిస్టేషన్లు కావని సచివాలయాల సిబ్బంది చెప్పడంతో వారు అయోమయయానికి గురవుతున్నారు. జిల్లాలో తాజాగా నమోదైన ఆటో డ్రైవర్ల సంఖ్య దాదాపు 7,500 ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వారందరికీ ప్రభు త్వం రూ.15 వేల వంతున ఇవ్వాల్సిందే.

పరివాహన్‌ యాప్‌ తప్పులతడక

ఇటీవల నేను ప్యాసింజర్‌ ఆటో కొనుగోలు చేసి, ఆధార్‌ సీడింగ్‌ చేసినప్పటికీ వాహనమిత్ర పథకానికి తన దరఖాస్తు చెల్లదని సచివాలయ సిబ్బంది తిరస్కరించారు. దీనికి రవాణా శాఖ అధికారులు పరివాహన్‌ యాప్‌ నుంచి పంపిన జాబితాయే కారణం. దానిని సరిచేసి అర్హుల జాబితాను పంపించాలి. లేకుంటే నాలాంటి ఎందరో అర్హులకు అన్యాయం జరుగుతుంది.

– మెర్ల వీరబాబు, ఆటో డ్రైవర్‌, మెర్లపాలెం,

ఆత్రేయపురం మండలం

వాహన మిత్ర ఖేదం!1
1/1

వాహన మిత్ర ఖేదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement