
ఉత్సాహంగా టీటీ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బుధవారం డీఎస్‌ఏ టీటీ(టేబుల్ టెన్నిస్) హాల్‌లో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల ప్రారంభ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–14, 17 కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్‌డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ టీటీ చాలా వేగవంతమైన క్రీడ అన్నారు. ఎంతో ఏకాగ్రత ఉంటేనే గాని టీటీలో రాణించలేమన్నారు. టీటీలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. సమాఖ్య కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టీటీ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో 120 మంది బాలబాలికలు ఎంపికలకు హాజరయ్యారు. అనంతరం టీటీ ఆడి డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్ ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘ నిర్వహణ కార్యదర్శి రవిరాజు, పీడీలు పాల్గొన్నారు. ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–14, 17 మహిళా కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు.