
రత్నగిరిపై ఏకాదశి పూజలు
● స్వామివారిని దర్శించిన 20 వేల మంది
● దేవస్థానికి రూ.20 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి భాద్రపద బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు స్వర్ణపుష్పాలతో అర్చన చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన, అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రసాదాలు నివేదించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ పూజలు నిర్వహించారు.
సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.