
అర్జీలు పునరావృతమైతే అధికారులే బాధ్యత వహించాలి
అమలాపురం రూరల్: అర్జీల పరిష్కారంలో కచ్చితమైన స్పష్టత ఉండాలని అర్జీలు పునరావృతమైతే సంబంధిత జిల్లా స్థాయి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని (జాయింట్ కలెక్టర్) జేసీ టి.నిషాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించి సుమారు 260 అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. డీఆర్వో మాధవి మాట్లాడుతూ అర్జీలు పరిష్కార తీరు పారదర్శకత, నాణ్యత ఉండాలని ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ వేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ మధుసూదన్, సమగ్రశిక్ష ఏపీసీ జి.మమ్మీ, ఎస్టీసీ పి.కృష్ణమూర్తి, డీఎల్డీవో వేణుగోపాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 23 అర్జీలు వచ్చాయి. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ రాహుల్ మీనా తొలిసారి పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదు అందగానే నిర్ణీత గడువులోగా ఆ సమస్యను పరిష్కరించి పోలీసింగ్‌పై అర్జీదారులకు సంతృప్తి, నమ్మకం కలిగేలా చేయాలని సూచించారు. తన వద్దకు వచ్చిన అర్జీదారులలో ఎస్పీ వారి సమస్యపై ముఖాముఖి చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉండడంతో ఎస్పీ వారితో కౌన్సెలింగ్ తరహాలో మాట్లాడి సమస్యకు పరిష్కార మార్గాలు సూచించారు. గ్రీవెన్స్‌ను పర్యవేక్షించే మహిళా ఎస్సై గంగాభవాని కూడా పాల్గొన్నారు.
తపాల శాఖలో ఆధార్
సేవలు మరింత విస్తృతం
అమలాపురం టౌన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా తపాలా శాఖ అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలోని ఆధార్ కౌంటర్ సేవలను మరింత విస్తృతం చేసిందని విశాఖపట్నం రీజినల్ పోస్ట్ మాస్టర్ జనరల్ వీఎస్ జయశంకర్ అన్నారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో ఈ ఎక్స్‌టెన్షన్ ఆధార్ కౌంటర్‌ను జయశంకర్ సోమవారం ప్రారంభించి ప్రసంగించారు. ఈ కౌంటర్ ఇక నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రెండు షిఫ్టుల్లో పనిచేస్తుందన్నారు. గతంలో ఉన్న కౌంటర్ పనిచేసే సమ యాన్ని మరింత పెంచి ఈ సేవలు అందిస్తున్నా మని వివరించారు. కార్యక్రమంలో అమలాపురం పోస్టల్ అసిస్టెంట్ సూప రింటెండెంట్ కె.శ్రీధరం, పోస్ట్ మాస్టర్ బి.వెంకన్నతో పాటు తపాలా సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్సీలో ఒకే గ్రామం
నుంచి ఏడుగురి ఎంపిక
మలికిపురం: ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ ఫలితాల్లో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు ఎంపికయ్యారు. మలికిపురం మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన అడబాల రత్నదయాకర్ (ఇంగ్లీష్), బోనం నాగదేవి (తెలుగు), అడబాల పుష్పలత (బీఎస్), బెజవాడ సాయిలక్ష్మి (పీఎస్), యెరుబండి రవిప్రసాద్ (ఎస్జీటీ), బొరుసు నాగేంద్రబాబు (ఎస్జీటీ), అడబాల దుర్గాదేవి(ఎస్జీటీ)లో ఎంపికయ్యారు.
ఉత్తమ సేవలు అందించాలి
ఏలూరు టౌన్: జిల్లా ఎస్పీలుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా కృషి చేయాలని ఐజీ సూచించారు.

అర్జీలు పునరావృతమైతే అధికారులే బాధ్యత వహించాలి