
సమాజంలో ఇంజినీరింగ్ వ్యవస్థ కీలకం
అమలాపురం టౌన్: సమాజంలో ఇంజినీరింగ్ వ్యవస్థ కీలకంగా ఉండి రోడ్లు, వంతెనల నిర్మాణాలకు మూల కారణం అవుతోందని జిల్లా పంచాయతీరాజ్ (పీఆర్) ఇంజినీరింగ్ ఆఫీసర్ పులి రామకృష్ణారెడ్డి అన్నారు. అమలాపురం ఎన్టీ ఆర్ మార్గ్‌లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఇంజినీర్స్ డే, ఇంజినీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమాల్లో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తొలుత ఆ కార్యాలయ ఆవరణలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పీఆర్ ఇంజినీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ మహానీయుని సేవలను కొనియాడారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ ఇంజినీర్ల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ, పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు మాట్లాడుతూ కోనసీమలో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు విశ్వేశ్వరయ్య స్ఫూర్తితోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురి ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు పీఆర్ అధికారులైన ఇంజినీర్లు మెమెంటోలు అందించి అభినందించారు. విశ్రాంత ఇంజినీర్ సీహెచ్ రామకృష్ణ తదితర ఇంజినీర్లను సత్కరించి వారికి ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మరో డీఈఈ పీఎస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఇలా ఇంజినీర్ల ప్రతిభ గుర్తించి అభినందిస్తే వారిలో పోటీతత్వం పెరిగి సమాజానికి నాణ్యమైన ఇంజినీరింగ్ వ్యవస్థ సాకారమవుతుందన్నారు. డీఈఈ శ్రీనివాస్, ఏఈఈలు కొండలరావు, సత్యనారాయణ, సంపన్న, సంధ్యతో పాటు 120 మంది పీఆర్ ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొని ఇంజినీర్స్ డే జరుపుకొన్నారు.