
వక్ఫ్ చట్టంపై సుప్రీం స్టేను స్వాగతిస్తున్నాం
అమలాపురం టౌన్: వక్ఫ్ చట్టం–2025పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన మధ్యంతర తీర్పు(స్టే)ను ముస్లింలు స్వాగతిస్తున్నారని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర పడినప్పటికీ ఈ చట్టానికి వ్యతిరేకంగా వందలకు పైగా కేసులు వేయడంతో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిందని చెప్పారు. అమలాపురంలో ఖాదర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వివాదాస్పద చట్టం గురించి వివరించారు. కోర్టు ఇచ్చిన స్టేను అనుసరించి కింది స్థాయిలో అధికారాలను డీనోటిఫై చేసేందుకు అనుమతించలేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారానే జరగాలన్న నిబంధన విధించిందని చెప్పారు. అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించే అంశంపై కూడా కోర్డు స్టే ఇవ్వడంపై ఖాదర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్ట సవరణలో అనేక లొసుగులు ఉన్నాయని ఆనాడే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు జగన్ పార్లమెంట్ ఉభయ సభల్లో తమ పార్టీ ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయించి ముస్లిం పక్షపాతిగా నిలబడ్డారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేసి ముస్లింలకు ద్రోహం చేసిందన్నారు. ఇప్పటికై నా ముస్లిం సమాజం మైనార్టీల పట్ల ఏ పార్టీ ప్రేమాభిమానాలు చూపిస్తుందో గ్రహించాలని ఖాదర్ హితవు పలికారు.
మెరుగైన వైద్య సేవల కోసమే ‘స్వస్థనారీ’ పథకం
సాక్షి, అమలాపురం: కేంద్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, తద్వారా సమాజాన్ని బలోపేతం చేసే దృఢమైన లక్ష్యంతో ‘స్వస్థ నారీ–సశక్త్ కుటుంబ అభియాన్’ను కేంద్రం రూపకల్పన చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 17న ప్రారంభించనున్నారని అదే రోజున ముఖ్యమంత్రి విశాఖపట్టణంలో రాష్ట్ర స్థాయిలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆయుష్మాన్ మందిరాలు, పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో వైద్య శిబిరాలు, అవగాహన శిబిరాలు సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య సేవలు అందిస్తారన్నారు. ఈ శిబిరాల్లో పోషకాహారం, ఆరోగ్య అవగాహన, కుటుంబ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ’పోషణ మహా’ నిర్వహణ ద్వారా పిల్లలు, మహిళలకు పోషణపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 560 శిబిరాలు ఈ 15 రోజుల పాటు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో దుర్గారావుదొర, డాక్టర్ సుమలత, ఏడీఎంఅండ్‌హెచ్‌ఓ సీహెచ్ భరతలక్ష్మి పాల్గొన్నారు.