
పోలీసింగ్‌పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతా
అమలాపురం టౌన్: పోలీసింగ్‌పై జిల్లా ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచి శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తానని జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులపై జరిగే వేధింపులు, గంజాయి తాగడం, కలిగి ఉండంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ తరహా నేరాల అదుపునకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా చర్యలు చేపడతానని చెప్పారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడారు. జిల్లాలో నేరాల అదుపునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించానని, ఆ ప్రణాళిక అమలు దిశగా ఈ రోజు నుంచే పనిచేస్తానని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో పలు చోట్ల రౌడీయిజం, సెటిల్‌మెంట్లు జరుతున్నాయన్న సమాచారంపై కూడా ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలకు మరింత అవగాహన కల్పించి వారిలో పోలీసుల వద్దకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలుగజేస్తానన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, చోరీల అదుపునకు ఆయా ప్రాంతాల నుంచి సమాచారం సేకరించి ఆ దిశగా చర్యలు చేపడతానన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న జాతీయ రహదారుల్లో ఉన్న గ్రామాలకు ఉన్న రోడ్డు మార్జిన్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. తమ పోలీస్ శాఖ, జాతీయ రహదారుల శాఖ సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపతానని ఎస్పీ తెలిపారు.