
వేడుకుందామా.. ఏడు వారాల స్వామిని..
● గోవింద నామస్మరణతో మార్మోగిన
వాడపల్లి
● ఒక్కరోజు ఆలయ ఆదాయం
రూ.80.04 లక్షలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని క్షేత్రం వాడపల్లి శనివారం భక్తజన కోలాహలంతో నిండిపోయింది. స్వామి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల వ్రతం ఆచరిస్తున్న వారి గోవింద నామస్మరణతో వాడపల్లి పులకించింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారికి ఉపచారాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని వీక్షించిన భక్తులు తన్మయులయ్యారు. అర్చకుల ఆశీర్వచం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వమిని దర్శించున్నారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాలను, సేవలను పరిశీలించారు.
పెరిగిన ఆదాయం
ప్రతి శనివారం కంటే ఈ వారం అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దానికి అనుగుణంగానే ఆదాయం కూడా పెరిగింది. ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశార్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.80,04,451 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు.