కువైట్‌లో మగ్గిపోతున్నా.. స్వదేశానికి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

కువైట్‌లో మగ్గిపోతున్నా.. స్వదేశానికి తీసుకెళ్లండి

Aug 5 2025 7:17 AM | Updated on Aug 5 2025 7:17 AM

కువైట్‌లో మగ్గిపోతున్నా..  స్వదేశానికి తీసుకెళ్లండి

కువైట్‌లో మగ్గిపోతున్నా.. స్వదేశానికి తీసుకెళ్లండి

కోనసీమ మహిళ వేడుకోలు

కొత్తపేట: కుటుంబ పోషణ కోసం విదేశానికి వెళ్తే, అక్కడ నిర్బంధించారని, పాలకులు దయతలచి స్వదేశానికి తీసుకువెళ్లాలని ఓ మహిళ వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన గుమ్మడి ధనలక్ష్మి ఈ వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించి వీడియో, ఆమె అక్క కుమారుడు కొత్తపేట మండలం బిల్లకుర్రు శివారు చిక్కాలవారిపేటకు చెందిన చిక్కాల రాజేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధనలక్ష్మి పుట్టిల్లు బిళ్లకుర్రు శివారు చిక్కాలవారిపేట కాగా, అత్తవారిల్లు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం. సుమారు 16 ఏళ్ల క్రితం గుమ్మడి రాంబాబుతో వివాహమైంది. భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి ఇద్దరు కుమారులు బీటెక్‌, ఇంటర్మీడియెట్‌ చదువుతున్నారు. ఇలాఉండగా విదేశంలో కొన్నేళ్లు ఉపాధికి వెళితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ధనలక్ష్మి ఆశించింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం కువైట్‌లోని ఓ షేక్‌ ఇంట్లో పనికి కుదిరింది. రెండేళ్ల అనంతరం స్వదేశంలో భర్త, పిల్లలను చూసివస్తానని అడిగితే, అక్కడి వారు జాప్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం తాను వెళ్లిపోతానని పట్టుబడితే ధనలక్ష్మిని ఇంట్లో నిర్బంధించారు. తిండి కూడా పెట్టలేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇండియన్‌ ఎంబసీకి చేరింది. కాగా ఆమె వాచ్‌ దొంగిలించి పారిపోయిందని షేక్‌ కేసు పెట్టడంతో, ప్రస్తుతం అక్కడే మగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ఉద్దేశించి తన దుస్థితిని వీడియో ద్వారా వెళ్లబోసుకుంది. ఆమె భర్త రాంబాబు, కుమారులు, బంధువులు అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథుర్‌, కలెక్టర్‌ ఆర్‌ మహేష్‌కుమార్‌ను కలిశారు. కువైట్‌లో మగ్గిపోతున్న ధనలక్ష్మిని ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్టు రాజేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement