
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
పెరవలి: కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ పల్లా దానయ్య(42) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, కేబుల్ వైర్ లాగటానికి విద్యుత్ స్తంభం ఎక్కిన అతడు విద్యుదాఘాతానికి గురై, స్తంభం పైనే చనిపోయాడు. స్తంభం ఎక్కినప్పుడు వైర్లు తగలడంతో అలాగే ఉండిపోయాడు. విద్యుత్ సరఫరా నిలిపివేశాక మృతదేహం కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, దానయ్యకు భార్య ధనలక్ష్మి, కుమారులు రామసతీష్, గోపి సంతోష్ ఉన్నారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎసై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.