
పుష్కరాలకు అంచనాలు
అమలాపురం రూరల్: 2027లో రానున్న పుష్కరాలకు జిల్లాలో ఉన్న స్నాన ఘట్టాల మరమ్మతులు, నూతన స్నాన ఘట్టాల ఏర్పాటు, కల్పించాల్సిన మౌలిక వసతులపై నియోజకవర్గాల వారీగా అంచనాలను రూపొందించి సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జలవనరుల శాఖ స్నాన ఘట్టాలు, స్నాన ఘట్టాల వద్దకు వెళ్లే అప్రోచ్ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాత్కాలిక పిండ ప్రధాన షెడ్లు, పుష్కరనగర్ ఏర్పాట్లు, మహిళలు దుస్తులు మార్చుకునే షెడ్లు, దైవ దర్శనాలకు, స్నాన ఘట్టాలకు వెళ్లే మార్గాలలో సైనింగ్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నదీ తీర ప్రాంతంలో, ప్రముఖ దేవాలయాలలో దర్శన ఏర్పా ట్లు, డార్మెట్రీలు, లైటింగ్ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలన్నారు.11 శాఖలు నిర్దేశిత పారామీటర్ల వారీగా ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్‌ఓ కె.మాధవి, పీ.శ్రీకర్, డీ.అఖిల,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి
ఏర్పాట్లు చేయాలి కలెక్టర్
15వ తేదీన జరిగే 79వ భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ఉత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లను ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు.