
ఆయన నిలువెత్తు బంగారం
● విద్యార్థుల ఆకలి తీరుస్తున్న
బంగారు చినశోభనాద్రి సత్రం
● రెండు పూటలా విద్యార్థులకు
భోజన సదుపాయం
● నిరుపేద వర్గాలకు ప్రాధాన్యం
● ప్రతి శనివారం
ఉచిత హోమియో వైద్య శిబిరం
● వందేళ్లు దాటిన దాతృత్వపు చరిత్ర
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అలనాడు బాటసారుల కోసం ఏర్పాటు చేసిన సత్రం నేడు నిరుపేద విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. కాకినాడ పెద్ద మార్కెట్ వద్దనున్న బంగారు చినశోభనాద్రి సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడ వచ్చి ఉంటున్న నిరుపేదల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రుచికరమైన భోజనం ఈ సత్రంలో అందిస్తున్నారు. గతంలో ఈ సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన వారికి ఉచితంగా వసతి కల్పించేవారు. వారి సంఖ్య తగ్గిపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. గతంలో వివిధ హోటళ్ల పాస్‌లను విద్యార్థులకు అందించేవారు. హోటళ్ల భోజనం సక్రమంగా ఉండకపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు 2017 సత్రం ఆవరణలో అన్నదాన భవనం నిర్మించారు. ఇక్కడ సిబ్బందిని నియమించి భోజన వసతి కల్పిస్తున్నారు. కాకినాడ నగరంలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ, వారి మెరిట్, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
సమాజ సేవలు
ప్రస్తుతం విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు, సత్రం ఆవరణలో ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి శనివారం 120 నుంచి 150 మంది రోగులు ఇక్కడ వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. ప్రతి వేసవిలో ఇక్కడ ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
నేటి నుంచి భోజనం
సత్రంలో మంగళవారం నుంచి విద్యార్థులకు భోజన వసతి కల్పించేందుకు సత్రం ఈవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు 90కి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ఏ కళాశాలలో చదువుతున్నారో ధ్రువీకరణ సత్రం, నిరుపేద కుటుంబాలు వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం జత చేసి, సత్రం కార్యాలయంలో దరఖాస్తు అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి భోజన వసతి కల్పిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కళాశాలలు మూసివేసే వరకూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నారు.
అర్హులైన విద్యార్థులందరికీ
భోజన వసతి
దాత ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాం. నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా 150 మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ఇక్కడ భోజన వసతి కల్పిస్తున్నాం. మంగళవారం నుంచి భోజన సదుపాయం ప్రారంభం కానుంది. విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
– చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి, ఈవో,
బంగారు చిన శోభనాద్రి సత్రం
101 ఏళ్ల చరిత్ర
ఈ సత్రానికి 101 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సత్రాన్ని 1924లో బంగారు చినశోభనాద్రి నెలకొల్పారు. ఈ సత్రం కోసం ఆయన 65 ఎకరాల వ్యవసాయ భూమి, 2,800 చదరపు గజాల స్థలాన్ని ఈ సత్రానికి దానం చేశారు. అప్పట్లో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన రోగులకు, వ్యాపారులకు ఇక్కడ ఎటు వంటి సదుపాయాలు ఉండేవి కావు. దీంతో శోభనాద్రి ఇక్కడ సత్రం ఏర్పాటు చేసి, వారికి ఆసరాగా నిలిచారు. వ్యవసాయ భూములు, దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సత్రం నిర్వహణకు వినియోగిస్తున్నారు.
ఇతర జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యం
కాకినాడలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువగా ఇక్కడ భోజన సదుపాయం కల్పిస్తున్నారు. విద్యార్థుల ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారికి సత్రంలో భోజనం అందిస్తున్నారు.

ఆయన నిలువెత్తు బంగారం

ఆయన నిలువెత్తు బంగారం

ఆయన నిలువెత్తు బంగారం