
విషాదంలో సీతారామ కాలనీ
● పోలీసుల అదుపులో నిందితుడు?
● సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు
సామర్లకోట: తల్లి, ఇద్దరు పిల్లల హత్య ఘటనతో పట్టణంలోని సీతారామ కాలనీలో సామవారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కూలీ పనులు చేసుకునే వారితో, పిల్లలు, పెద్దల అరుపులు, కేకలతో సీతారామ కాలనీ నిత్యం సందడిగా ఉంటుంది. ఇదే కాలనీలో నివసిస్తున్న ములపర్తి ధనుప్రసాద్ భార్య మాధురి(30), కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీలోన(6)ను హత్యకు గురైన విషయం విదితమే. తొలుత ధనుప్రసాద్‌పై అనుమానంతో పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. తన భార్య వద్ద ఉండాల్సిన బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్లు కనిపించలేదని అతడు పోలీసులకు తెలిపాడు. శనివారం రాత్రి ధనుప్రసాద్ ఏడీబీ రోడ్డు పనుల కాంట్రాక్టర్ వద్ద ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య కేసును వేగంగా ఛేదించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడ్డారు. కాగా ధనుప్రసాద్ సమాచారం మేరకు మాధురి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని ప్రకాశం జిల్లా కనిగిరిలో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్ అనే వ్యక్తి మాధురిని, పిల్లలను హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. మరో వ్యక్తితో కూడా మాధురి వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు తెలుసుకున్న ప్రియుడు సురేష్.. ఆమెతో శనివారం రాత్రి ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ నిద్ర లేచి వచ్చారు. ఘర్షణ సమయంలో మాధురి అందుబాటులో ఉన్న కర్రతో సురేష్‌ను కొట్టినట్టు తెలిసింది. అదే కర్రను అందిపుచ్చుకుని అతడు మాధురితో పాటు, పిల్లల తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు సమాచారం. సురేష్ సొంత లారీపై డ్రైవర్‌గా పని చేస్తూ, తన సంపాదనతో ప్రియురాలికి కోరినవన్నీ కొనిపెడుతుండగా, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇది వద్దని చెప్పినా వినకపోవడంతోనే సురేష్ ఈ హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. భార్యాబిడ్డలు హత్యకు గురి కావడంతో ధనుప్రసాద్ సోమవారం స్పృహతప్పి పడిపోయాడు. అతడిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో సీతారామ కాలనీ విషాదంలో మునిగిపోయింది.