
హాస్టల్.. హడల్
ఫ సమస్యల చెరలో సంక్షేమ వసతి గృహాలు
ఫ అధ్వానంగా మరుగుదొడ్లు
ఫ కూటమి ప్రభుత్వంలో
కొరవడిన పర్యవేక్షణ
సాక్షి, అమలాపురం/ రావులపాలెం/ అంబాజీపేట/ రాజోలు / కాట్రేనికోన: చదువరులకు సం‘క్షేమం’ దూరమైంది.. సౌకర్యాల కల్పన అందని ద్రాక్షలా మారింది.. సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బాల్యం సతమతమవుపోతోంది.. చీకటి గదుల్లో పాట్లు, చాలీచాలని గదులు, అధ్వాన మరుగుదొడ్లతో అగచాట్లు, ఇలా ఒకటేమిటి అన్నీ అవస్థలే.. రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో జిల్లాలో సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలను ‘సాక్షి’ నెట్‌వర్క్ పరిశీలించింది. అక్కడ విస్తుపోయే ఎన్నో సమస్యలు కనిపించాయి. విద్యార్థుల ఇబ్బందులు వెలుగు చూశాయి. వాటిని ఒకసారి చూద్దాం రండి.
జిల్లాలో 22 బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు 23 ఉండగా, ఇందులో సుమారు 2,100 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన బాల బాలికలు ఉన్నత చదువులపై ఉన్న మక్కువతో ఇక్కడికి వస్తుంటారు. అటువంటి వారి కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో కనీస సదుపాయాల కల్పన.. విద్యార్థుల ఆరోగ్యం.. వారికి అందించే ఆహారం.. ఇలా సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్వహణను పూర్తిగా వదిలేసింది. జిల్లాలోని సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లను చూస్తే కనీస వసతులు అంతంత మాత్రమే అని తెలుస్తోంది. చాలా వసతి గృహాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ కనీస వసతులు లేవు. మురుగుదొడ్లు చాలవు. పది మందికి ఒక టాయిలెట్, ఒక బాత్రూమ్ ఉండాలన్న నిబంధన ఇక్కడ అమలు కాదు. ఉన్నచోట పరిశుభ్రత లేదు. వర్షం నీరు లీకు అవుతోంది. స్వచ్ఛమైన తాగునీటికి ఆర్వో ప్లాంట్‌లు లేవు. కిటికీల నుంచి దోమలు రాకుండా మెస్‌లు ఏర్పాటు చేయలేదు. ఉన్నచోట చిరిగిపోయాయి. దీంతో విద్యార్థినీ విద్యార్థులు దోమలతో నిత్యం సహవాసం చేస్తున్నారు. దీంతో సాధారణ, విష జ్వరాల బారిన పడుతున్నారు.
కను‘మరుగు’.. స్నానాలు దేవుడెరుగు
రావులపాలెంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 1, 2లు బాలికల హైస్కూల్ పక్కన ఒకే భవనంలో ఉన్నాయి. రెండతస్తుల భవనంలో ఉన్న ఈ హాస్టళ్లలో పైన ఉండే అంతస్తులో హాస్టల్–1, కింది అంతస్తులో హాస్టల్–2ను నిర్వహిస్తున్నారు. ప్రతి అంతస్తులో ఏడు గదులు ఉన్నాయి. ఈ భవనంలో 160 మంది విద్యార్థులు ఉండేందుకు అనుమతి ఉంది. కానీ కనీస వసతులు లేక, 122 మంది మాత్రమే ఉంటున్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల కొరత తీవ్రమైంది. పది మందికి ఒక టాయిలెట్, ఒక బాత్రూమ్ ఉండాలన్న నిబంధన ఇక్కడ కానరావడం లేదు. మొత్తం 10 టాయిలెట్స్, పది బాత్రూమ్‌లు ఉండగా టాయిలెట్ నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. ఇక ఐదు బాత్రూమ్‌లు శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా మారాయి. ఉన్న ఐదు వాటిలోనే బాలికలు స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పైఅంతస్తులో మూడు గదుల శ్లాబ్‌లు లీకవడంతో గదుల్లో వర్షం కురుస్తుంది. దీంతో రెండు గదులు నిరుపయోగంగా ఉండగా, మిగిలిన ఐదు గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ గడపాల్సిన పరిస్థితి. ఇక వంట గది స్లాబ్ లీకవుతోంది. ఇక్కడ తాగునీటి కోసం ఏర్పాటైన ఆర్వో ప్లాంట్ పూర్తిగా పాడైంది. అదేవిధంగా హాస్టల్‌కు వెళ్లే దారి సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో మలమూత్ర విసర్జన చేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది.
కానరాని ప్రహరీ!
అంబాజీపేట మండలం గంగలకుర్రులో ఉన్న సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంలో 103 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వసతి గృహం చుట్టూ ప్రహరీ లేక విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ రాత్రి వేళల్లో విద్యార్థులు భయపడుతున్నారు. వసతి గృహం చుట్టూ శుభ్రత లేనందున దుర్వాసన వెదజల్లుతుంది. విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు నెలలు గడుస్తున్నా రావడం లేదు. మామిడికుదురు బాలుర, బాలికల వసతి గృహాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. బాలుర వసతి గృహం చుట్టూ తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. డ్రైనేజీ సదుపాయం సక్రమంగా లేక మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. పి.గన్నవరం మండలం నరేంద్రపురంలోని గురుకుల పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ కూడా డ్రైనేజీ సదుపాయం సక్రమంగా లేదు. హాస్టల్ ప్రాంగణం పల్లంగా ఉండటంతో ముంపు నీరు నిలిచిపోతుంది. తరగతి గదులకు చెందిన తలుపులు, కిటికీలు పాడైపోయాయి. బాత్రూమ్ డోర్లు సక్రమంగా లేవని ఇటీవల విద్యార్థులు స్వయంగా మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఫలితం లేదు.
సిబ్బంది.. లేక ఇబ్బంది
రాజోలు ఎస్సీ బాలుర వసతి గృహానికి ఇన్‌చార్జి వార్డెన్ ఉండటం వల్ల హాస్టల్ పర్యవేక్షణ కొరవడింది. హాస్టల్ నూతన భవనం నిర్మాణంలో ఉండటంతో అద్దె భవనంలో కొనసాగుతోంది. 57 మంది విద్యార్థులకు 5 గదులు మాత్రమే ఉన్నాయి. ఇరుకు గదుల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. బాత్‌రూమ్‌లలో పైపులైన్లు పాడైపోవడంతో పిల్లలు నీరు మోసుకుని వెళ్లాల్సి వస్తోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. రెండు హాస్టళ్లకు వార్డెన్లు ఇన్‌చార్జులు కావడం వల్ల వారానికి రెండు మూడు రోజులు మాత్రమే వస్తున్నారు. రెండు హాస్టళ్లు ఒకే కాంపౌండ్‌లో ఉండటం వల్ల విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్న సందర్భాలున్నాయి. బీసీ సంక్షేమ హాస్టల్‌లో సైతం సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు ట్యూటర్ లేరు. విద్యార్థులకు భోజనం, చదువు, నిద్ర అన్ని ఒకే హాలులోనే. సిబ్బంది కొరత ఉంది. ఒక వార్డెన్, ఒక రెగ్యులర్ స్టాఫ్, ఒక ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు.
నేలపైనే నిద్ర
కాట్రేనికోన బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో వార్డెన్‌తో పాటు ఇద్దరు సిబ్బంది, 18 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహం గోడలకు సున్నం వేయకపోవడం, గదుల్లో వెలుతురు లేకపోవడంతో చీకటిగా ఉంటుంది. ఇది బూత్ బంగ్లాను తలపిస్తోంది. గదుల్లో ఫ్యాన్లు ఉన్నా కిటికీలకు దోమలు మెస్‌లు లేవు. 18 మంది రెండు గదుల్లోనే సర్దుకుని ఉంటున్నారు. దోమల కాటుతో విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు దుప్పట్లు, జిమ్కానాలు ఇవ్వకపోవడం, చాపలు, బెడ్ సీట్లు లేక నేలపైనే చలిలో నిద్రిస్తున్నారు. ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు.

హాస్టల్.. హడల్

హాస్టల్.. హడల్

హాస్టల్.. హడల్

హాస్టల్.. హడల్

హాస్టల్.. హడల్