
వరద... వర్షం
కొనసాగుతున్న వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన వాయుగుండం ముప్పు తప్పింది. అయితే దీని ప్రభావంతో జిల్లాలో గురు, శుక్రవారాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకూ సగటున 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా రామచంద్రపురం మండలంలో 19.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా ఐ.పోలవరం మండలంలో 2.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. ఆలమూరు 17.2, ఆత్రేయపురం 17, మండపేట 16, రావులపాలెం 15.6, కె.గంగవరం 14.8, కొత్తపేట 14.4, ముమ్మిడివరం 13.6, రాయవరం 12.8, కపిలేశ్వరపురం 11.2, పి.గన్నవరం 9.8, ఉప్పలగుప్తం 7.6, అంబాజీపేట 7.4, కాట్రేనికోన 6.8, అల్లవరం 6.6, అమలాపురం 6.2, మలికిపురం 4.8, అయినవిల్లి 4.6, సఖినేటిపల్లి 4.2, రాజోలులో 3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ఫ జిల్లాకు మరోసారి గోదావరి పోటు
ఫ కాటన్ బ్యారేజీ నుంచి 4.36 లక్షల క్యూసెక్కుల విడుదల
ఫ మరింత పెరగనున్న ప్రవాహం
ఫ రెండు రోజులుగా ఒక మోస్తరు వానలు
సాక్షి, అమలాపురం: గోదావరికి మరోసారి వరద పోటు తగిలింది. గోదావరి క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి రెండు రోజులుగా వరద జలాల రాక పెరుగుతోంది. కాటన్ బ్యారేజీ నుంచి శనివారం ఉదయం 3,52,011 క్యూసెక్కుల వరద నీరు చేరింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి బ్యారేజీ నుంచి దిగువకు 4,36,321 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. క్యాచ్‌మెంట్ ఏరియాలో పడుతున్న వర్షాల ప్రకారం వరద ఉధృతి సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకూ ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా గోదావరి ఉధృతి పెరుగుతోంది.
వరద నీటి ప్రభావం దిగువన కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలపై పడింది. గౌతమీ, వృద్ధ గౌతమీ, వైనతేయ, వశిష్ట నదీపాయలలో వరదనీరు ఉరకలేస్తోంది. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్టు, ఐ.పోలవరం అన్నంపల్లి అక్విడెక్టుల వద్ద వరద నీరు పోటెత్తుతోంది. ఇక్కడ క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరంలలోని నదీ గర్భంలోని లోతట్టు ప్రాంతాల లంక భూములను తాకుతూ వరద ప్రవహిస్తోంది. పి.గన్నవరంలో జి.పెదపూడిలంక, బూరుగులంక, ఊడుమూడిలంక, అరిగెలవారిపాలేనికి వెళ్లే తాత్కాలిక రహదారి ఈ నెల రెండో వారంలో వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీనితో ఈ లంక వాసుల రాకపోకలకు తాత్కాలికంగా పడవలు ఏర్పాటు చేశారు. తరువాత వరద తగ్గడంతో తిరిగి రాకపోకలు మొదలు కాగా, మరోసారి వరద పోటు తగలడంతో స్థానికులు పడవలను ఆశ్రయించక తప్పడం లేదు. వరద మరింత పెరిగితే ఈ మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయిలంక కాజ్‌వేపై నీరు చేరే అవకాశముంది. అదే జరిగితే ఇక్కడ వాహన రాకపోకలు నిలిచిపోనున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

వరద... వర్షం