
ఏపీపీడీసీఎంఏ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నాయుడు
అమలాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏపీపీడీసీఎంఏ) మూడు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా అమలాపురానికి చెందిన విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏబీ నాయుడు నియమితులయ్యారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు జె.రమణారావు ఈ మేరకు నాయుడికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా నాయుడు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలను పర్యవేక్షించనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో సంస్థాగతంగా, పాలనపరంగా, విద్యా పరంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నాయుడు పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రానున్న కాలంలో డిగ్రీ స్థాయిలో వివిధ కొత్త కోర్సుల ప్రారంభానికి తన వంతు ప్రయ త్నిస్తానన్నారు. నాయుడు నియామకం పట్ల రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.రాజ్‌కుమార్ చౌదరి, రాజమహేంద్రవరం నన్నయ విశ్వవిద్యాలయం పరిధి అధ్యక్షుడు ఎండీ హబీత్ బాషా, కార్యదర్శి ఎన్.కనకయ్య, ప్రిన్సిపాల్స్ బి.సుబ్బారాయుడు. బి.సుధీర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.
వెండి కవచం సమర్పణ
కాజులూరు: కోలంకలో వెలసిన శ్రీలక్ష్మీకేశవస్వామి వారికి శనివారం స్థానిక క్షత్రియ పరిషత్ సభ్యులు వెండి కవచం సమర్పించారు. దంతులూరి కుటుంబానికి చెందిన సాధుకృష్ణవర్మ, వెంకట సత్యనారాయణరాజు, వెంకట నరసింహరాజు, విశ్వనాథ వెంకట కేశవరాజు, కృష్ణవర్మ, వెంకట రాఘవరాజు, సుబ్బరాజు, వెంకట తిరుపతిరాజులు రూ. 7 లక్షలతో వెండి కవచం తయారు చేయించి దంతులూరి వెంకట విజయగోపాలకృష్ణరాజు, కృష్ణవేణి దంపతులచే ఆలయానికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవల్లి శ్రీనివాసాచార్యులు శనివారం సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరించారు.
ఉపాధ్యాయులపై శిక్షణలను రుద్దడం సరికాదు
అమలాపురం టౌన్: వరల్డ్ బ్యాంక్‌కు సంబంధించిన సాల్ట్ పథకం, కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఈపీలో భాగంగా రకరకాల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణలను ఉపాధ్యాయులపై నిర్బంధంగా రుద్దడం సరికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) జిల్లా శాఖ అధ్యక్షుడు నరాల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి దీపాటి సురేష్‌బాబు అన్నారు. ఇదే సమస్యను పరిష్కరించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడికి పీఆర్‌టీయూ జిల్లా శాఖ తరఫున ఓ లేఖ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ ప్రతికూల విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న శిక్షణ, యాప్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరానికి కృషి చేయాలని వారు ఎమ్మెల్సీని అభ్యర్థించారు. ఈ కోర్సులు, శిక్షణలు నేర్చుకుని విద్యా శాఖకు చెందిన వివిధ యాప్‌లలో సమాచారం నింపడం వల్ల ఉపాధ్యాయులు తరగతి గదుల్లో చేసే బోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బోధనతో సమాంతరంగా శిక్షణ వద్దని వారు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలా రకరకాల శిక్షణలతో బోధన – అభ్యాసనకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అన్నారు. ప్రస్తుతం అత్యవసమంటూ ప్రకటిస్తున్న ‘ఐ గాట్ కర్మయోగి’, ‘ఎఫ్‌ఎల్‌ఎన్’ ఆన్‌లైన్ శిక్షణ చేస్తున్నప్పుడు వచ్చే సర్వర్ సిగ్నల్ సమస్యలతో ఎంత ప్రయత్నించినా ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. దీనివల్ల కొందరు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారు గుర్తు చేశారు.
30న జాబ్‌మేళా
బాలాజీచెరువు: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ఇ.వసంతలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మశీ సంస్థ 20 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందని, 18 నుంచి 35 ఏళ్ల లోపు అభ్యర్థులు హాజరుకావచ్చని, పదో తరగతి అపైన ఇంటర్మీడియెట్, బి.ఫార్మశీ, ఎం.ఫార్మశీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు.

ఏపీపీడీసీఎంఏ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నాయుడు

ఏపీపీడీసీఎంఏ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నాయుడు