ఏపీఈఏపీ సెట్‌కు సన్నాహాలు
ఫ నేడు, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు
ఫ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాయవరం: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీ సెట్–2025) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కాకినాడ జేఎన్‌టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీ సెట్ నిర్వహిస్తున్నారు. ఏపీ ఈఏపీ సెట్ (పాత ఎంసెట్)లో భాగంగా సోమ, మంగళవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరుపుతారు. దీనికోసం జిల్లాలో అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పరిధిలో శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక్కో విడత ఆన్‌లైన్‌న్‌పరీక్షకు 200 మంది వరకూ విద్యార్థులను కేటాయించారు. ఈ విధంగా రోజుకు 800 మంది విద్యార్థులు జిల్లాలో పరీక్షకు హాజరు కానున్నారు.
రెండు షిఫ్ట్‌లుగా..
కంప్యూటర్ బేస్డ్ విధానంలో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలు ఉదయం మొదటి షిఫ్ట్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తారు. విద్యార్థులు కనీసం గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలు, మధ్యా హ్నం 2 గంటలకు కచ్చితంగా ఆన్‌లైన్లో పరీక్షను ప్రా రంభించాల్సి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఒక్క నిమి షం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిబంధనల్లో పొందుపర్చింది. జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు 5,631 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలకు 1,596 మంది, ఇంజినీరింగ్ పరీక్షలకు 4,130 మంది, రెండు పరీక్షలకు ఆరుగురు హాజరు కానున్నారు. కాగా ఏపీ ఈఏపీ సెట్ ద్వారా విద్యార్థులకు ఇంజినీరింగ్ (బీటెక్), బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ సైనన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ (అగ్రికల్చర్), హార్టీకల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైనన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీ ఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
● ఏర్పాట్లు పూర్తి చేశాం
పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చాం.
–వీవీ సుబ్బారావు, కన్వీనర్,
ఏపీ ఈఏపీ సెట్, జేఎన్‌టీయూ, కాకినాడ
ఏపీఈఏపీ సెట్‌కు సన్నాహాలు


