
నాన్నా.. ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది.. చుక్కలు రాత్రి ఎందుకు వస్తాయి.. ఆకాశంలో ఎవరున్నారు.. చందమామ మీద లైట్లు ఉన్నాయా.. ఇలాంటి ప్రశ్నలు ఏడేళ్ల అన్వేష్ నుంచి తండ్రికి అప్పుడప్పుడు ఎదురవుతూంటాయి. కొద్దోగొప్పో చదువుకున్నా అన్వేష్ తండ్రికి వాటి గురించి ఆ చిన్నారికి వివరించే పరిజ్ఞానం లేదు.. దీంతో ఏదో ఒకటి చెప్పి సమాధానపరిచేస్తూంటాడు. బాల్యంలో చాలా మందికి ఆకాశం వైపు చూడగానే ఎన్ని సందేహాలో.. మరి ఎలా తీరుతాయి.. చెప్పాల్సిన తల్లిదండ్రులకూ తెలియదాయె.. ఈ నేపథ్యంలోనే అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్నాయి. సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులకు అంతరిక్షంపై కనీస అవగాహన కల్పించేందుకు ఇవి దోహదపడతాయి.
(డెస్క్–రాజమహేంద్రవరం) : అంతరిక్షం గురించి పూర్తిగా తెలియకపోయినా ప్రాథమిక విషయ పరిజ్ఞానమైనా అందరికీ ఉండాలని ఇస్రో భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకూ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని నాలుగు నగరాలను ఇందుకు ఎంపిక చేసింది. ఇందులో రాజమహేంద్రవరం కూడా ఒకటి. స్పేస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ థీమ్‌తో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈసారి వారోత్సవాలను నిర్వహిస్తోంది. మిగిలిన మూడు నగరాల్లో అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో చేస్తూండగా మన రాజమహేంద్రవరంలో మాత్రం వీటిని ప్రజల మధ్య నిర్వహిస్తూండటం విశేషం. అందుకే ఇస్రో ఇక్కడే ఎక్కువ దృష్టి సారించింది. ఇప్పటికే రోజుకొక ప్రత్యేక కార్యక్రమాలతో ఆకట్టుకుంది. ఆనం కళాకేంద్రంలో ప్రదర్శనాంశాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంతరిక్షానికి సంబంధించి క్విజ్ పోటీలు నిర్వహించింది. విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు శ్రీహరికోట షార్ ఎల్‌ఎస్‌ఎస్‌ఎఫ్ జనరల్ మేనేజర్ ఎన్ విజయకుమార్ చెప్పారు. వారోత్సవాల్లో చిన్నా పెద్దా అందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు.
ఏమిటీ వారోత్సవాలు!
నాటి సోవియట్ యూనియన్ (రష్యా) 1957లో తొలి మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించి, అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టింది. 1967 అక్టోబర్ 10న చంద్రునితో సహా ఇతర ఖగోళ ప్రాంతాల్లో పరిశోధనకు సంబంధించిన కార్యకలాపాల ఒప్పందంపై వివిధ దేశాలు సంతకాలు చేశాయి. అందులో మన దేశమూ ఉంది. అక్టోబర్ 4 – 10 తేదీల మధ్య ఈ చారిత్రక సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ రెండు తేదీల మధ్య ఉన్న కాలంలో అంతరిక్ష వారోత్సవాలు జరపాలని ఐక్యరాజ్య సమితి 1999లో నిర్ణయించింది. అంతరిక్ష విజయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఇస్రో మన దేశంలో ఈ వేడుకలకు నేతృత్వం వహిస్తోంది.
నింగి వైపు దూసుకు వెళుతూ..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే మన దేశం అంతరిక్ష రంగంపై దృషి పెట్టింది. ఇందుకు అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయి అచంచల కృషి తోడయ్యింది. ఫలితంగా 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి (ఇన్‌కోస్పార్) ఆవిర్భవించింది. తర్వాత ఉపగ్రహాల ప్రాధాన్యాన్ని గుర్తించి, కేరళలోని త్రివేండ్రం వద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కు శ్రీకారం చుట్టింది. మొదట్లో అమెరికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లపై అధ్యయనం జరిగేది. సైంటిస్టుల ప్రతిభతో కొద్ది కాలంలోనే దేశీయంగా రాకెట్లను తయారు చేసే స్థితికి మన దేశం అభివృద్ధి చెందింది. 1969లో ఇన్‌కోస్పార్ కాస్తా ఇస్రోగా మారింది. మరో మూడేళ్ల తర్వాత అంతరిక్ష ప్రత్యేక విభాగం ఏర్పడింది. ఇలా స్వాతంత్య్రం సిద్ధించిన రెండు దశాబ్దాలకే అంతరిక్ష రంగంలో మనం అగ్రదేశాల సరసకు చేరగలిగాం. ఓటములెదురైనా మన శాస్త్రవేత్తలు నిరాశ చెందకుండా వైఫల్య పాఠాలే విజయానికి పునాదిరాళ్లుగా మలచుకుని అంతరిక్ష రంగంలో ప్రపంచమే నివ్వెరపోయే స్థితికి మన దేశాన్ని నడిపించారు. ఈ ఏడాది చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో అగ్రదేశాలను దాటుకుని సగర్వంగా ముందుకు దూసుకుపోయింది.
మనం..ఘనం
1975 ఏప్రిల్ 19న మన దేశం తొలి ఉపగ్రహం ఆర్యభట్టను రష్యా నుంచి ప్రయోగించింది.
1980లో శ్రీహరికోట నుంచి ఎస్‌ఎల్‌వీ ద్వారా రోహిణి–1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. మన దేశం నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహమిది.
1984 ఏప్రిల్ 3న మన దేశానికి చెందిన తొలి వ్యోమగామి రాకేష్‌శర్మ సోయజ్–2 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్లతో కలిసి అంతరిక్షంలో అడుగు పెట్టారు.
1992లో ఆగ్మెంటెండ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఏఎస్‌ఎల్‌వీ) ప్రయోగం విజయవంతం కావడం మన శాస్త్రవేత్తల్లో కొండంత బలాన్ని నింపింది.
రక్షణ, విద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఎంతో ఉపయోగపడే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ)ను 1994లో ప్రయోగించాక మన దేశం ఇక వెను తిరిగి చూడలేదు.
2001లో మరింత శక్తిసామర్థ్యాలను మరింతగా కూడగట్టుకునేలా జియోసింకర్నస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) నిర్మాణానికి శ్రీకారం చుట్టి, ఏకంగా 5 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపే స్థాయికి చేరింది.
2022లో అత్యాధునిక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రయోగం విజయవంతమైంది. ఇది ఎన్నో ఉపగ్రహాలను నింగికి మోసుకు వెళ్లింది.
ఈ ఏడాది ఆగస్టులో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగడం అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది.
ఈ క్రమంలోనే సూర్యునిపై అధ్యయనానికి ఈ ఏడాది సెప్టెంబర్ 2న ‘ఆదిత్య ఎల్–1’ ప్రయోగం చేపట్టింది. దీని విజయం కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.