తొలి ప్రమిద ఎవరిది?

Who Lights First Dia In World - Sakshi

సూర్య చంద్ర తారకలు, మెరుపు, అగ్నీ అనేవి ఆ పరం జ్యోతి పెట్టిన తొలి ప్రమిదలని శాస్త్రం చెబుతోంది. 
భిన్నమైన పలు గాధల సమాహారమే దీపావళి. శ్రీరామ పట్టాభిషేకం, బలి పాతాళ నిర్బంధనం, నరకుని మరణం, విక్రమార్కుని పట్టాభిషేకం, యమధర్మజునికి నీరాజనోత్సవం, గోపూజా, గోవర్ధన గిరి పూజలు, లక్ష్మీపూజ, జ్యేష్ట్యా దేవి నిష్క్రమణోత్సవం, తీర్ధంకరుడిని జ్ఞానలక్ష్మి అనుగ్రహించిన  దినం, కాళీ పూజలు, మార్గ పాలిని పూజ.. వీటిలో కొన్ని మన అందరికి తెలిసి గాధలైతే ఇంకొన్ని తెలియనివి ఉన్నాయి. కాలక్రమంలో దీపావళి పండుగ పలు పేర్లను పొందింది అన్న విషయం కూడా మనకి తెలియనిదే. ఈ పండుగ మార్చుకున్న పేర్లు, వాటి వెనుక దాగిన గాథలూ, ఈ పండుగ పుట్టుక వంటి ఆసక్తికర అంశాలను పరిశీలిస్తే విస్మయం కలుగుతుంది. ఋగ్వేద కాలంలో పుట్టిన సంప్రదాయం ఇది.

దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వతమోపహం 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే 

.. అని ఆర్యోక్తి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది యేదో గుర్తించే మనం, చీకటిలో ఆ శక్తిని కోల్పోతాం. చీకటినే పోగొట్టాలంటే  వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. పర బ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదే విధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్ధాలైన సూర్య–చంద్ర–తారకలు, మెరుపు, అగ్నీ అనేవి ఆ పరం జ్యోతి ప్రకాశాలే తప్ప మరొకటి కావని స్పష్టం చేశాయి. మన పండుగలు అన్ని జ్యోతిశ్శాస్త్త్ర్రంతో ముడిపడి ఉన్నవే కావడం గమనించదగిన అంశం. దీపావళి కూడా అందుకు భిన్నమైన పండుగ కాదు అంటోంది శాస్త్రం.

వేదకాలంలో దీపావళి పదమూడు రోజుల పండుగ. అసలు దీపావళి అనే శబ్దం ప్రాచీన వేదాలలో ఎక్కడా కనిపించదు. అప్పట్లో దీపావళి పేరు ‘యక్ష రాత్రి’ అని పి. కె .గోడే అనే కాశీ పండితుడు పేర్కొన్నాడు. పదిహేనవ శతాబ్ది గ్రంధాలైన ‘నిర్ణయం’, ‘ధర్మ సింధువు’ లలో మొదటిసరిగా దీపావళి అనే పదం కనిపించింది. అంటే సుమారుగా గత ఐదు వందల ఏళ్ల కిందటి నుంచి మాత్రమే దీపావళి పండుగను దీపావళి పేరుతో జరుపుకుంటున్నాం. పదహారవ శతాబ్ది వరకు దీపావళి ఐదు రోజుల పాటు సాగిన పండగ కాగా నేడది కేవలం రెండు రోజుల పాటు మాత్రమే  చేసుకునే పండగ అయ్యింది. 

చారిత్రక విశేషాలు
నరకాసురుని రాజధాని ప్రాగ్జ్యోతిష్యపురం నేటి మన అస్సాం రాష్ట్రంలోని గౌహతి. అయితే అప్పట్లో అది బర్మా వరకు వ్యాపించి ఉన్న ప్రాంతం. కృష్ణ, సత్య, నరకాసుర యుద్ధం గౌహతిలో 5065 సంవత్సరాల క్రితం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.  కృష్ణుని ద్వారకా నగరం అరేబియా సముద్ర తీరమైన కథియవాడ్‌ ప్రాంతంలో ముంబైకి కొంత దూరంలోఉంది. ద్వారక పడమటి  కొనలో ఉంటే, ప్రాగ్జ్యోతిష్యపురం తూర్పు కొనలో ఉంది.రామ, రావణ సంగ్రామ కాలం నాటికే ఫిరంగుల వాడకం ఉంది. వీటినే రావణ ఫిరంగులని,రావణ శతఘ్నులు అని పిలిచేవారు. నరక–సత్యల సంగ్రామంలోనూ వీటిని ఉపయోగించారు. అవి కాలగమనంలో బాణాసంచా అయ్యాయి. (చదవండి: దీపం జ్యోతి పరబ్రహ్మ..  )

Read latest Devotion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top