Nizamabad: గుప్పుమంటున్న గంజాయి!

Youth Addiction To Ganjai In Nizamabad - Sakshi

సాక్షి, బాల్కొండ(నిజామాబాద్‌): గంజాయి మత్తులో యువత పెడదోవ పడుతున్నారు. గంజాయికి బానిసలుగా మారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా మెండోరా మండలం బుస్సాపూర్‌లో గంజాయి మత్తులో జోగుతున్న ఓ యువకుడు అకారణంగా రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడిచేయడంతో మృతి చెందాడు. బాల్కొండలో కొందరు యువకులు గంజాయికి మైకంలో బైక్‌ల చోరీకి పాల్పడిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంత జరుగుతున్నా గ్రామాల్లో గంజాయిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరం. 

గంజాయితో ఛిద్రమైన జీవితం 
మెండోరా మండలం బుస్సాపూర్‌కు చెందిన సోమ నవీన్‌ గంజాయికి బానిసై గంజాయి తాగిన మైకంలో  దాడికి పాల్పడి వృద్ధుడి మరణానికి కారణమై కటకటాల పాలయ్యాడు. చదువు కోవడానికి అబ్రా డ్‌ వెళ్లాల్సిన యువకుడు గంజాయి వలన జీవితాన్ని ఛిద్రం చేసుకున్నాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి గారబంగా పెంచింది. కానీ ప్రస్తుతం కొడుకు ప్రవర్తను చూసి ఆ తల్లే తన కొడుకుని చంపండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.  

గంజాయి మత్తులో అనేక ఘటనలు 
గంజాయి మత్తులో జోగుతున్న యువకులు ఆ మైకంలో ఏం చేస్తున్నామో కూడా గుర్తించలేని స్థితిలో ఇతరుల ప్రాణాలను సైతం హరిస్తున్నారు. హాసాకొత్తూర్‌కు చెందిన గిరిజన యువకుడు సిద్ధార్థను గంజాయి మత్తులోనే హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య తదనంతరం ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం పోలీసులకు ప్రజలు ఎదురు తిరగడం జరిగింది. మెండోరా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక యువకుడిపై కొందరు యువకులు గంజాయి సేవించి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

చివరకు రాజీపడి కేసు నుంచి తప్పించుకున్నారు. మోర్తాడ్‌లో ఒక యువకుడు గంజాయి మత్తులో బైక్‌ను వేగంగా నడిపి ఒక కూలీ మరణానికి కారణమయ్యాడు. కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌ లో యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నా యి. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో దందా జోరుగా సాగుతుంది. నిర్మల్, నిజామాబాద్‌ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రధానంగా పోచంపాడ్‌ గంజాయి వ్యాపారులకు అడ్డాగా ఉందనే వార్త బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి గంజాయి విక్రయాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  

చదవండి: తువ్వాలులో జీఏవైరు పెట్టి మెడకు బిగించి హత్య  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top