విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా...

Woman And Her Five Children Deceased in Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌: కుటుంబ కలహాలతో విసిగిన ఓ మహిళ తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. మహాసముంద్‌–బెల్సొందా మార్గంలోని ఇమ్లిభట కెనాల్‌ వంతెనపై రైలు పట్టాలపై పడి ఉన్న ఆరు మృతదేహాలను గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. బెంచా గ్రామానికి చెందిన కేజవ్‌ రామ్‌ సాహు పొరుగూరు ముధెనాలోని రైస్‌ మిల్లులో కార్మికుడు పనిచేస్తున్నాడు. బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చిన కేజవ్‌రామ్‌ ఇంటి ఖర్చుల విషయమై భార్య ఉమా సాహు(45)తో గొడవపడ్డాడు. రాత్రి భోజనం తర్వాత అతడు నిద్రపోయాడు.

భర్తతో జరిగిన తగవుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉమా సాహు, కుమార్తెలు అన్నపూర్ణ(18), యశోద(16), భూమిక(14), కుంకుం(12), తులసి(10)లను వెంట తీసుకుని అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రైల్వే వంతెనపైకి వెళ్లింది. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి వారంతా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదన్నారు. కనిపించకుండాపోయిన తన భర్య, కూతుళ్ల కోసం బుధవారం రాత్రే వెదికాననీ, ఉదయానికల్లా వారు తిరిగి వస్తారని భావించినట్లు కేజవ్‌ సాహు పోలీసులకు తెలిపాడు. కాగా, ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: ఇంటర్నెట్‌ సౌకర్యం లేని వారికీ జీవించే హక్కుంది

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top