అసలు ‘రేవ్‌’ రచ్చ గురించి తెలుసా? | What is Rave Party? And Know How It Is Illegal In India In Telugu | Sakshi
Sakshi News home page

Bangalore Rave Party: అసలు ‘రేవ్‌’ రచ్చ గురించి తెలుసా?

Published Mon, May 27 2024 10:03 AM

What is Rave Party?

రేవ్‌ పార్టీ అంటే ఇదేనంటూ.. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిన ఒక పోస్ట్‌

కానీ, అసలు వ్యవహారం వేరే

ఇంగ్లండ్‌లో పుట్టిన కల్చర్‌

ఐటీ సిటీలో విచ్చలవిడి వినోదాలు 

సంపన్నులే అతిథులు  

అసాంఘికతకు పెద్దపీట?  

బనశంకరి: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్‌ పార్టీ. బెంగళూరు నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో అధిక మంది తెలుగువాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ, సినీప్రముఖులు ఉన్నారని  ప్రచారం జరుగుతోంది. అసలు రేవ్‌ పార్టీలు అంటే ఏమిటి, ఇందులో కేవలం సెలబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు, ఆ  పార్టీలో  ఎలాంటి పనులు చేస్తారు, ఎందుకు సంపన్నులకు అంత వెర్రి అని ప్రజలు  ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌కాగా.. క్లారిటీ ఇచ్చే యత్నమే  ఈ కథనం. 

నైట్‌ క్లబ్‌లు, పబ్‌లు అనే పాశ్చాత్య సంస్కతి దేశంలో వేళ్లూనుకున్నాయి. సెలబ్రెటీలు, బడాబాబులు.. వాటిలో తనివితీరా ఎంజాయ్‌ చేయడం జరుగుతుంది. అంతకుమించి కావాలనుకునేవారి కోసం రేవ్‌ పార్టీలు రెడీగా ఉంటాయి.  రేవ్‌ పార్టీ అనే సంస్కృతి 1950లో ఇంగ్లండ్‌లో ప్రారంభమై మెల్లగా ప్రపంచమంతా విస్తరించింది. ఈ కల్చర్‌ ప్రారంభమైన కొత్తల్లో పెద్ద హాల్, లేదా ఎక్కడైనా చుట్టూ మూసి ఉన్న ప్రదేశంలో పెద్దగా మ్యూజిక్‌ పెట్టుకొని డ్యాన్సులు చేయడం, కావలసినంత మద్యం తాగడమే. ఆ షోలో నృత్యాలు చేసే కళాకారులు కూడా ఉండేవారు. అయితే..

రానురాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. ఇందులోకి విచ్చలవిడి సంస్కృతి ప్రవేశించింది. నెమ్మదిగా ఈ  రేవ్ పార్టీల్లోకి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జత అయ్యాయి. అతిథులు ఈ పారీ్టల్లో విచ్చలవిడిగా డ్రగ్స్‌ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం ఉంటాయని సమాచారం. అన్నింటికీ తెగించేవారే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం.   

అన్ని రకాల హడావుడి
ముంబై, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్‌ లాంటి నగరాల్లోనే ఈ కల్చర్‌ పెరిగిపోతుంది. ఇతరులకు  ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవడం సబబే, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం, అరుపులు, కేకలతో స్థానికులకు ఇబ్బంది పెట్టడం చట్ట విరుద్ధమే అవుతుంది. పైగా డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అడుగు పెడుతున్నారు.  

సాధారణమైనా, రేవ్‌ అయినా పార్టీలపై పోలీసులు రైడ్‌చేసి అందులో డ్రగ్స్‌ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. అశ్లీలత జరిగిందా, మైనర్లు పాల్గొన్నారా అన్నది కూడా ఆరాతీస్తారు. అనుమానం ఉంటే రక్తం, వెంట్రుకల నమూనాలను తీసుకుని టెస్టులకు పంపిస్తారు. ఆపై కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్‌ వాడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి.  

టికెట్‌ చాలా రేటు  
సాధారణంగా రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు రూ.50 లక్షలు అని ప్రచారం సాగుతోంది.  ఇంత డబ్బు పోసి టికెట్‌ కొనాలి. వాటిని చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పారీ్టలో  పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్‌ చేస్తారు. అతిథుల అభిరుచులను బట్టి పార్టీలో ఏర్పాట్లు ఉంటాయి. మద్యం, డ్రగ్స్, ఇంకా కొన్ని అంశాలు లభిస్తాయి. రేవ్‌పార్టీని బడా బాబుల ఫాంహౌస్, గెస్ట్‌ హౌస్‌లలో నిర్వహిస్తారు.  24 గంటల నుంచి 3 రోజుల వరకు కొనసాగవచ్చు.  ఆహారం, ఆల్కహాల్‌ వంటి అన్ని వసతులూ లభిస్తాయి. ఊహల్లో మాత్రమే లభించే రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంత మోజు అంటారు. పార్టీలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు.

ఉద్యానగరిలో దందా  
గత కొన్నేళ్లుగా సిలికాన్‌ సిటీలో రేవ్‌పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడమే కారణం. రెండేళ్ల క్రితం నగర పోలీసులు దాడిచేసి పలువురు సినీ సెలబ్రెటీలను అరెస్ట్‌ చేయడంతో పాటు డ్రగ్స్‌ను కూడా పట్టుకున్నారు. టెక్కీలు, ధనవంతును లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఖరీదైన పార్టీలను సాగిస్తున్నారు. వాటి నిర్వాహకులకు అటు నాయకులు, ఇటు ఖాకీలతో సంబంధాలు ఉండడంతో చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్నిసార్లు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. కొన్నిరోజులు హడావుడి జరగడం, ఆపై సద్దుమణగడం షరా మామూలుగా మారుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement