స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్‌ నోట్‌ కలకలం | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్‌ నోట్‌ కలకలం

Published Sun, Mar 21 2021 4:06 AM

Visakha Steelplant employee suicide note created sensation - Sakshi

ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శ్రీనివాసరావు అనే స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి రాసిన లేఖ కలకలం రేపింది. 5:47 నిమిషాలకు ఉక్కు ఫర్నేస్‌లో దూకి అగ్నికి ఆహుతి కాబోతున్నట్లు లాగ్‌బుక్‌లో రాసిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయారు. అతని టేబుల్‌ వద్ద ఐడీ కార్డు, పర్సు, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. అతనికోసం పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే శ్రీనివాసరావు ఆర్థికపరమైన మోసాల్లో ఉన్నాడని, సూసైడ్‌ నోట్‌లో రాసినట్టుగా అతను ప్లాంట్‌ ఫర్నేస్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశమే లేదని విశాఖ నగర సౌత్‌ ఏసీపీ సీహెచ్‌ పెంటారావు చెప్పారు. 

లాగ్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌..
స్టీల్‌ప్లాంట్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగానికి చెందిన సోర్నపూడి శ్రీనివాసరావు(50) వైర్‌ రాడ్‌ మిల్‌–1లో విధులు నిర్వహిస్తున్నారు. యధావిధిగా శుక్రవారం రాత్రి విధులకు హాజరయ్యారు. శనివారం ఉ.5 గంటల ప్రాంతంలో షిఫ్ట్‌రూమ్‌లోని లాగ్‌బుక్‌లో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఆవేదన తెలుపుతూ సూసైడ్‌ నోట్‌ రాశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం చేయవద్దని, ఇందుకోసం తన ప్రాణాన్ని 5.47 నిమిషాలకు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి ఇస్తున్నానని రాశారు. ఈ పోరాటం తన ప్రాణత్యాగంతో ప్రారంభం కావాలన్నారు.  ఉదయం షిఫ్ట్‌ విధులకు హాజరైన ఉద్యోగులు లాగ్‌బుక్‌ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్‌ ఏసీపీ పెంటారావు, సీఐ సత్యనారాయణరెడ్డి షిఫ్ట్‌రూమ్‌కు చేరుకుని అక్కడి ఉద్యోగులను విచారించారు. శ్రీనివాసరావు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక సింహగిరి కాలనీలో నివసిస్తున్న అతని కుటుంబీకులను విచారించారు. అతనికోసం గాలింపు చర్యల్లో భాగంగా గేటు సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. అతని మొబైల్‌ కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు.

ఆర్థికపరమైన మోసాల్లో ఉన్నాడు: ఏసీపీ
సూసైడ్‌ నోట్‌ రాసి కనిపించకుండా పోయిన స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి శ్రీనివాసరావు ఆర్థికపరమైన మోసాల్లో ఉన్నాడని విశాఖ నగర సౌత్‌ ఏసీపీ సీహెచ్‌ పెంటారావు తెలిపారు. ఏసీపీ విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని శ్రీనివాసరావు మోసం చేశాడన్నారు. కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి నలుగురితో సుదీర్ఘంగా మాట్లాడినట్టు గుర్తించామన్నారు. వారిని విచారించగా ప్లాంట్‌లో ఉద్యోగాలిప్పిస్తానని సుమారు రూ.50 లక్షలు తీసుకున్నట్టు వెల్లడైందన్నారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంపై వారు ప్రశ్నించగా నకిలీ ఆర్డర్లు ఇచ్చాడని, మరికొంతమందికీ నకిలీ ఆర్డర్లు ఇచ్చినట్టు గుర్తించామని తెలిపారు. సూసైడ్‌ నోట్‌లో రాసినట్టుగా శ్రీనివాసరావు ప్లాంట్‌ ఫర్నేస్‌లో ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని, అతను ఉదయం గేటు నుంచి బయటకు వెళ్లినట్టు కొంతమంది చెప్పారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, శ్రీనివాసరావు కుమారుడు మహేష్‌ మాట్లాడుతూ.. తన తండ్రి మోసం చేసే వ్యక్తి కాదన్నారు. తన తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలపాలన్నాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement