Guntur: జీజీహెచ్‌లో పసికందు కిడ్నాప్‌

A three-day-old baby boy Kidnapped Guntur Government Hospital - Sakshi

కొద్ది గంటల్లోనే తల్లి ఒడికి చేర్చిన పోలీసులు  

మహిళ సహా ఇద్దరు కిడ్నాపర్ల అరెస్ట్‌   

గుంటూరు (ఈస్ట్‌): గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్‌)లో మూడు రోజుల మగ శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 7 గంటల్లోపే కేసును ఛేదించి శిశువును తల్లి ఒడికి చేర్చారు. శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఉప్పతల మహేష్‌ భార్య ప్రియాంకను ప్రసవ సమయం దగ్గర పడటంతో కుటుంబ సభ్యులు ఈ నెల 11వ తేదీన జీజీహెచ్‌లో చేర్పించారు. ప్రియాంక ఈ నెల 13న మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ నెల 15వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహేష్‌ తల్లి ఏసుకుమారి వార్డులో కోడలి పొత్తిళ్లలో ఉన్న శిశువు ఏడుస్తుండటంతో ఎత్తుకుని వార్డు బయటకు తీసుకొచ్చింది.

కొద్దిసేపటి తరువాత ఆ పసికందును ప్రియాంక తల్లి పార్వతమ్మ వద్ద ఉంచి బాత్‌రూమ్‌కు వెళ్లింది. కొద్దిసేపటికే పార్వతమ్మ నిద్రలోకి జారుకోగా.. బాత్‌రూమ్‌ నుంచి తిరిగొచ్చిన ఏసుకుమారికి పసికందు కనిపించలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కొత్తపేట ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులురెడ్డి పోలీసు బృందాల్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు రైల్వేస్టేషన్‌ వైపు ఉన్న మెయిన్‌ గేటు నుంచి బయటకు చేరుకుని ఆటో ఎక్కి వెళ్లిపోయినట్టు గుర్తించారు.

ఆటో ఎటు వెళ్లిందో కూపీ లాగిన పోలీసులు చివరకు ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడి సహాయంతో నిందితుల ఇంటికి వెళ్లారు. నిందితులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదలకు చెందిన హేమవర్ణుడు, రెడ్డి పద్మజలను అరెస్ట్‌ చేసి పసికందును తల్లి ఒడికి చేర్చారు. మగ శిశువును అపహరించి విక్రయిస్తే భారీగా సొమ్ము సంపాదించవచ్చని భావించిన హేమవర్ణుడు పథకం ప్రకారం పద్మజతో కలిసి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top