సీబీఐ పిటిషన్లో టీడీపీ పలుకులు!

TDP Comments in CBI petition - Sakshi

కస్టడీ పిటిషన్లో పొంతనలేని వ్యాఖ్యలు

శివశంకర్‌రెడ్డిని ఇరికించడానికే నన్నట్లుగా వాదన

సాక్షి, అమరావతి: వై.ఎస్‌.వివేకా హత్య కేసులో అరెస్టయిన డి.శివశంకర్‌రెడ్డిని జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వాలంటూ గురువారం కడప ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేటు ఎదుట సీబీఐ వేసిన పిటిషన్లోని అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలనే... తమ దర్యాప్తులో తేలిన అంశాలుగా సీబీఐ పేర్కొనటం ఇక్కడ గమనార్హం. ‘‘నిందితుడు డి.శివశంకర్‌రెడ్డి... హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం 6.30 సమయంలో సమాచారం అందుకుని వివేకా ఇంటికి వెళ్లారు. ఆయన్ను రక్తపు మడుగులో చూశాక... గుండెపోటు వచ్చిందని చేసిన ప్రచారంలో తాను భాగమయ్యాడు. వై.ఎస్‌.వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు ఆయనే సాక్షి టీవీకి సమాచారమిచ్చాడు’’ అని సీబీఐ పేర్కొంది. నిజానికి శివశంకర్‌రెడ్డి వివేకా ఇంటికి వెళ్లక మునుపే ‘సాక్షి’ టీవీ సహా పలు టీవీల్లో ఆ వార్త వచ్చేసింది.

పైపెచ్చు శివశంకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని వివేకా బంధువుల ద్వారా సమాచారం అందుకుని అక్కడకు వెళ్లేసరికే వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి, ఇనయతుల్లా, వాచ్‌మెన్‌ రంగన్న, పనిమనిషి సహా పలువురు అప్పటికే అక్కడున్నారు. అందరూ ఉండగా తాను రక్తపు మడుగును తుడిపించటం వంటివి సాధ్యమా? ఆ తరవాత సీఐతో సహా ఎర్ర గంగిరెడ్డి వచ్చి... పరిస్థితిని తన అధీనంలోకి తీసుకుని... రక్తాన్ని తుడిపించారన్నది అందరూ చెబుతున్న మాట. సీఐ, పోలీసులు ఉండటం వల్ల వారు చెప్పింది పని మనుషులు చేశారన్నది వారి వాదన. ఇక తనకు ఫోన్‌ చేసిన వివేకా బావమరిది శివప్రసాద్‌ రెడ్డే గుండెపోటుతో చనిపోయారని అన్నట్లు శివశంకర్‌రెడ్డి చెబుతున్నారు. ఎందుకంటే అంతకు ముందే ఇనయతుల్లా ఫోటోలు తీసి వివేకా కుటుంబీకులకు వాట్సప్‌ కూడా పంపించారు. దాన్ని బట్టి శివశంకర్‌రెడ్డి అక్కడకు వెళ్లేటప్పటికే రక్తాన్ని తుడిచేశారని అర్థం కావటం లేదా? మరి సీబీఐ దీన్ని ఎందుకు విస్మరించింది?

అంతమంది సమక్షంలో జరిగినా...
నిజానికి రక్తాన్ని తుడవటం, గాయాల దగ్గర బ్యాండేజీ వేయటం వంటివి స్థానికులు పెద్ద సంఖ్యలో ఉండగానే జరిగాయి. మరి శివశంకర్‌రెడ్డి తలుపు గడియ పెట్టుకుని లోపల ఇదంతా చేసినట్లు సీబీఐ చెబుతున్న వాదనను ఏమనుకోవాలి? నిజానికి హత్య జరిగిన రోజు వివేకా బావమరిది తనకు చెప్పారంటూ... వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయంగా మీడియా ముందుకొచ్చి చెప్పారు. అదేవ్యక్తి తనకూ అదే విషయం చెప్పారని దేవిరెడ్డి శివశంకరరెడ్డి చెబుతున్నారు. కానీ ‘సాక్షి’ టీవీకి శివశంకరరెడ్డే చెప్పినట్లు సీబీఐ పేర్కొనటాన్ని ఏమనుకోవాలి?

దస్తగిరి స్టేట్‌మెంట్లో వేరేలా ఉంది కదా?
ఇతర నిందితులకు భారీగా డబ్బులు ఎర వేయటం ద్వారా శివశంకర్‌ రెడ్డి, ఆయన సహచరులు వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. హత్యకు కొన్ని రోజుల ముందు శివశంకర్‌రెడ్డి పులివెందుల లోని తన స్నేహితుడు బయపురెడ్డి ఇంటికి షేక్‌ దస్తగిరిని పిలిచాడని, తన పేరు ఎక్కడా బయటకు రాకూడదని అక్కడే చెప్పాడని దర్యాప్తులో తేలిందని కూడా పేర్కొంది. నిజానికి దస్తగిరి కోర్టుకు ఇచ్చిన స్టేట్‌మెంట్లో ఈ వివరాలు మరో కోణంలో ఉండటం గమనార్హం. ‘‘ఈ హత్య చేస్తే మనకు శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.40 కోట్లు ఇస్తాడు. మీ వాటా మీకొస్తుంది’’ అని గంగిరెడ్డి తనతో చెప్పినట్లు ఆ స్టేట్‌మెంట్లో దస్తగిరి పేర్కొన్నాడు. తనకు నేరుగా శివశంకర్‌రెడ్డి తెలియదనే పరోక్షంగా చెప్పాడు. కానీ సీబీఐ మాత్రం దస్తగిరిని హత్యకు ముందే శివశంకర్‌రెడ్డి తన ఇంటికి పిలిచాడని పేర్కొనటం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే సీబీఐ కావాలని శివశంకర్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోందన్నది ఈ కేసును గమనిస్తున్న వారి మాట. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top