8 గంటలు ప్రశ్నల వర్షం

Rhea Chakraborty admits to procuring drugs - Sakshi

రెండోరోజూ రియాను విచారించిన నార్కోటిక్‌ బ్యూరో

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారి పేర్లను బయటపెట్టిన రియా!

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో వరుసగా రెండో రోజు సోమవారం కూడా నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట హాజరయ్యారు. ఆమెను ఎనిమిది గంటలపాటు ఎన్‌సీబీ విచారించింది. బాలార్డ్‌ ఎస్టేట్‌లోని ఎన్‌సీబీ కార్యాలయానికి ఉదయం 9:30 నిముషాలకు పోలీసు ఎస్కార్టుతో వచ్చిన రియా, ఆరు గంటలకు తిరిగి వెళ్ళారు.

విచారణ సందర్భంగా రియాచక్రవర్తి, డ్రగ్స్‌ తీసుకొంటోన్న బాలీవుడ్‌కు చెందిన కొందరి పేర్లను కూడా వెల్లడించడం సంచలనానికి దారితీసింది. 18 నుంచి 19 మంది పేర్లు రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ తెప్పించానని, తాను మాత్రం ఎప్పుడూ సేవించలేదని రియా తెలిపారు. అయితే సిగరెట్లు తాగే అలవాటుందని రియా చెప్పారు. తన సోదరుడు షోవిక్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరాదారు బాసిత్‌ పరిహార్‌ని ఐదుసార్లు కలిసినట్టు, అతడు తన నివాసానికి సైతం వచ్చేవాడని రియా వెల్లడించారు.

రియాని, శామ్యూల్‌ మిరాండాతో కూర్చోబెట్టి విచారించగా.. రియా తనకు డ్రగ్స్‌ తీసుకొనే అలవాటు లేదని, కానీ సుశాంత్, అతని స్నేహితులు డ్రగ్స్‌ తీసుకునేవారని వెల్లడించినట్లు తెలిసింది. సుశాంత్‌ 2016 నుంచి డ్రగ్స్‌ తీసుకోవడం మొదలుపెట్టినట్టు రియా వెల్లడించింది. మిరాండా ద్వారా డ్రగ్స్‌ తెప్పించి రియా సుశాంత్‌కి ఇచ్చేదని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రియాను విచారించిన విషయం తెలిసిందే. రియాతో ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ హౌస్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్‌ సావంత్‌లను కలిపి, విడివిడిగా ప్రశ్నించనున్నారు. దీనికోసం రియాని మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ ముత్తా అశోక్‌ జైన్‌ వివరించారు. ఆమె విచారణకు సహకరిస్తోందన్నారు. కాగా ఈ కేసులో అనూజ్‌ కేశ్వానీ అనే వ్యక్తిని సోమవారం ఎన్‌సీబీ అరెస్టు చేసింది. రియా అరెస్టు తప్పకపోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.  

సుశాంత్‌ సోదరిపై రియా ఫిర్యాదు
సుశాంత్‌ సింగ్‌ సోదరి ప్రియాంకతోపాటు ఢిల్లీకి చెందిన డాక్టర్‌ తరుణ్‌పై  రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ మానసిక సమస్యల చికిత్స కోసమంటూ వీరు తయారు చేసి ఇచ్చిన తప్పుడు, ఫోర్జరీ ప్రిస్క్రిప్షన్‌ వల్లే అతడు చనిపోయాడని ఆరోపించారు. ఈ మేరకు బాంద్రా పోలీసులకు ఫిర్యాదు పంపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top