తండ్రిని చంపేశారనే కక్షతో.. | Police Solved Realtor Raghupathis Murder Which Created A Sensation | Sakshi
Sakshi News home page

రియల్టర్‌ హత్య కేసు: తండ్రిని చంపేశారనే కక్షతో..

Jul 21 2022 7:31 AM | Updated on Jul 21 2022 7:31 AM

Police Solved Realtor Raghupathis Murder Which Created A Sensation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో సంచలనం సృష్టించిన రియల్టర్‌ రఘుపతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పదమూడేళ్ల క్రితం తన తండ్రి జంగారెడ్డిని కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో కక్ష పెంచుకున్న అతని కుమారుడు శ్రీకాంత్‌ రెడ్డి.. రఘుపతిని అంతమొందించేందుకు రూ.30 లక్షలకు కర్ణాటకకు చెందిన కిరాయి గుండాలతో సుపారీ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం కిరాయి మూకలు ఈనెల 15న దమ్మాయిగూడలోని శివనగర్‌లో రఘుపతిపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీ కాంత్‌ రెడ్డి, మంజునాథ్‌లతో పాటు సుపారీ గ్యాంగ్‌లోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మల్కజ్‌గిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, ఎస్‌ఓటీ డీసీపీ కే మురళీధర్‌లతో కలిసి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. 

  • దమ్మాయిగూడ పీఎస్‌ రావ్‌ నగర్‌కు చెందిన సూరకంటి శ్రీకాంత్‌ రెడ్డి తండ్రి జంగారెడ్డికి కాప్రా మండలం చక్రిపురంలోని సీతారాం నగర్‌కు చెందిన హతుడు అంబటి రఘుపతి అలియాస్‌ రఘుకు 2009లో ప్లాట్‌ విషయంలో తగాదా ఏర్పడింది. దీంతో రఘుపతి, మరికొందరు స్నేహితులతో కలిసి జంగారెడ్డిని హత్య చేశాడు. 2012లో ఈ కేసులో న్యాయస్థానం రఘుపతిని నిర్ధోషిగా తేల్చింది. అప్పట్నుంచి శ్రీకాంత్‌ రెడ్డి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని భావించిన శ్రీకాంత్‌ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి జంగారెడ్డికి దగ్గరి స్నేహితుడు మంజునాథ్‌ సహాయం కోరాడు. జంగారెడ్డి హత్య  అనంతరం మంజునాథ్‌ కర్నాటకలోని శిమోగా జిల్లాలో మెటీరియల్‌ వ్యాపారంలో స్థిరపడ్డాడు. 
  • రఘుపతిని హత్య చేసేందుకు కర్నాటకకు చెందిన కిరాయి హంతకుడు రిజ్వాన్‌తో రూ.30 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇతను తన స్నేహితులైన భావిత్, మహ్మద్‌ సాదీఖీ అలియాస్‌ రహాద్, ఇస్మాయిల్, సమీర్‌ ఖాన్, సుమిత్, నేతలతో కలిసి నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి శ్రీకాంత్‌ రెడ్డి దమ్మాయిగూడలోని పీఎస్‌రావ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆశ్రయం కల్పించాడు. హంతకులు తిరిగేందుకు సెకండ్‌ హ్యాండ్‌లో కారు కూడా కొన్నాడు. వీరు నెల రోజులుగా రఘుపతి ఇళ్లు, తదితర ప్రాంతాలను రెక్కీ చేశారు. 
  • ఈ క్రమంలో ఈనెల 15న రాత్రి రఘుపతి తన స్నేహితులు ప్రసాద్, బాబు, రామానుజన్‌లతో కలిసి శివనగర్‌లోని ఓ ప్లాట్‌ దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్‌వీఆర్‌ వైన్స్‌ సమీపంలో నిందితులు కత్తులు, వేట కొడవళ్లతో రఘుపతిపై దాడి చేశారు. అతడి తలకు తీవ్ర గాయాలు కావటంతో రఘుపతి అక్కడికక్కడే మరణించాడు. రఘుపతి స్నేహితుడు ప్రసాద్‌కు ఎడమ భుజంపై తీవ్ర గాయాలయ్యాయి.  
  • హత్య అనంతరం ఘటనాస్థలి నుంచి ద్విచక్ర వాహనాలపై శ్రీకాంత్‌ రెడ్డికి ఇంటికి వెళ్లిన నిందితులు.. అక్కడ్నుంచి రెండు కార్లలో రాష్ట్ర సరిహద్దులను దాటేశారు. హత్యకు వినియోగించిన వేట కొడవళ్లను కీసర నుంచి ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌కు వెళ్లే మార్గంలో చిత్రంభళారే విచిత్రం స్టూడియో పక్కన ఉన్న పొదల్లో పారవేశారు. రూ.30 లక్షలలో కొంత మొత్తాన్ని శ్రీకాంత్‌ రెడ్డి రిజ్వాన్‌కు అందించగా.. నిందితులు పంచుకున్నారు. 

సుపారీ డబ్బుల కోసం వచ్చి చిక్కారు.. 
సుపారీ డబ్బుల్లో ఇంకా కొంత రావాల్సి ఉండటంతో హంతకులు సాదీఖ్, ఇస్మాయిల్, సమీర్‌ ఖాన్‌ కర్నాటక నుంచి శ్రీకాంత్‌ రెడ్డికి చెందిన బొమ్మలరామారం మండలం రంఘపురంలోని ఫామ్‌ హౌస్‌కు వచ్చారు. అప్పటికే సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించిన జవహర్‌నగర్‌ పీఎస్, మల్కజ్‌గిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు మాటువేసి ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌ రెడ్డి, మంజునాథ్, కాప్రా మండలం సాయిబాబానగర్‌కు చెందిన కావాడీ రాజేశ్‌లతో పాటు అంతరాష్ట్ర నిందితులు ముగ్గుర్ని మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి నాలుగు వేట కొడవళ్లు, మూడు కత్తులు, కారు, బైక్‌లను స్వా«దీనం చేసుకున్నారు. రిజ్వాన్, భావిత్, సుమిత్, నేతలు పరారీలో ఉన్నారు.  

(చదవండి: తాగుబోతు అల్లుని కిరాతకం.. భార్యను ఇంటికి పంపలేదని)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement