కొబ్బరి కాదు.. కాలకూటం!

Police Caught Ganja Smugglers Gang Lorry Odisha - Sakshi

జయపురం(భువనేశ్వర్‌): కొరాపుట్‌ జిల్లాలో గంజాయి రవాణా ముఠా రోజుకో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అధికారుల కళ్లు గప్పి, పెద్ద ఎత్తున సరుకు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల లోడు మధ్య ట్రక్కులో తీసుకు వెళ్తున్న సుమారు 16క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్‌ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్‌ ఎస్పీ మనోజ్‌కుమార్‌ సెఠి ఆదివారం వెల్లడించారు. గంజాయి రవాణా అవుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ బంటువ, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ రథ్‌తో కూడిన ప్రత్యేక బృందం జయపురం వైపు వెళ్తున్న ట్రక్కును గమనించారు. వారిచ్చిన ఆనవాళ్ల ఆధారంగా ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్భదల్‌ బిశ్వాల్, ఆఫీస్‌ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్‌ కండి, ఏఎస్‌ఐ ఎం.లక్ష్మణరావు, మాధవేశ్‌ మహంతి, సిబ్బంది జయపురం ఘాట్‌ రోడ్డులో మాటు వేశారు. అతి వేగంగా వస్తున్న ట్రక్కుని నిలువరించి, సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరి కాయలతో పాటు 150  గంజాయి బస్తాలు బయటపడ్డాయి. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.81 లక్షలు ఉంటుందని వెల్డించారు. ఘటనకు సంబంధించి బీహార్‌ రాష్ట్రానికి చెందిన డ్రైవర్‌ ప్రభు యాదవ్‌(35)ను అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. 

పద్మపూర్‌లో 3 క్వింటాళ్లు.. 
రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ పోలీసులు రూ.15 లక్షల విలువైన 3క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యష్‌బీర్‌ సింగ్‌(60), పన్నాలాల్‌ బాస్‌దేవ్‌(57)ను అరెస్ట్‌ చేశారు. పద్మపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరిడిగుడ వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రాయగడ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. క్రిమిసంహారక మందు సరఫరా చేసే డ్రమ్ముల్లో 300 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో లారీతో పాటు డ్రైవర్, హెల్పర్‌ను అరెస్ట్‌ చేసి, కోర్టుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. 

నలుగురి అరెస్ట్‌.. 
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి మంత్రిపూట్‌ గ్రామం వద్ద చిత్రకొండ పోలీసులు శనివారం రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, 253 కిలోల గంజాయిని గుర్తించారు. దీనిని బీహార్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జిల్లాలోని ఎంవీ–38 గ్రామానికి చెందిన ప్రకాష్‌ సర్దార్, బీహర్‌కు చెందిన సునీల్‌కుమార్, హరేంద్రకుమార్, విజేంద్రకుమార్‌ లను అరెస్ట్‌ చేశారు. నిందితులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్‌డీపీఓ అన్షుమాన్‌ ద్వివేది తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top