లాయర్ల హత్య కేసు: మధ్యంతర నివేదిక సిద్ధం!

Peddapalli Lawyer Case Ramagundam Police Submit Report To High Court - Sakshi

గోదావరిఖని(రామగుండం): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు–నాగమణిల హత్య కేసు మధ్యంతర నివేదిక సిద్ధమైనట్లు తెలిసింది. కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, ఈ నెల 15న పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించడంతోపాటు జడ్జి సమక్షంలో నిందితులు, సాక్షుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నెలరోజులు సుదీర్ఘ విచారణ చేపట్టిన రామగుండం కమిషనరేట్‌ పోలీసులు నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. కేసు వివరాలను సోమవారం హైకో ర్టుకు సమర్పించనున్నారు. చార్జిషీట్‌ దాఖలు కోసం సాక్ష్యాల సేకరణ, నిందితుల గుర్తింపు, ఆయుధాల సేకరణ కోసం పోలీసులు ఏ1, ఏ2, ఏ3, ఏ4 నిందితులను మంథని కోర్టు అనుమతితో 14 రోజులపా టు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తీసుకున్నారు.

హైకోర్టు నియమించిన ప్రత్యేక బృందంతోపాటు రామగుండం కమిషనరేట్‌ పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారించారు. ఆయుధాల స్వాధీనం కోసం రెండ్రోజులు ఏ1 కుంట శ్రీను, ఏ2 చిరంజీవిని సుందిళ్ల బ్యారేజీ వద్దకు తీసుకెళ్లారు. ఆయుధాలు పడేసిన స్థలంలో విశాఖ గజ ఈతగాళ్లతో గాలించి రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దుస్తులు, ఫోన్ల విషయంపై ఇంకా స్పష్టత లేదు. హత్యకు ఆయుధాలు సమకూర్చిన ఏ4 నిందితుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్‌ నుంచి కూడా పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. వామన్‌రావు కోర్టుకు వచ్చిన విషయాన్ని ఫోన్‌ ద్వారా సమాచా రం అందించిన ఏ5 నిందితుడు ఊదరి లక్ష్మణ్‌ అలియాస్‌ లచ్చయ్యను గత నెల 17న రిమాండ్‌కు తరలించారు. బిట్టు శ్రీనుకు సహకరించిన ఏ6 కాపు అనిల్‌ను విచారించిన పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.

120 మంది స్టేట్‌మెంట్‌ రికార్డు 
120 మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష సాక్షులతోపాటు నిందితులతో సంబంధాలు ఉన్నవారిని, హతుల కుటుంబీకులు, స్నేహితులు, వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులను పోలీసులు విచారణకు పిలిచి వారి స్టేట్‌మెం ట్‌ నమోదు చేశారు. ఇటు గుంజపడుగు గ్రామస్తుల స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేసినట్లు తెలిసింది.  

11 మంది ప్రత్యక్ష సాక్షులు 
ఇక ఈ జంటహత్యలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారితోపాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వా మన్‌రావు చివరి మాటలను సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేసిన వ్యక్తి, మరో ఆరుగురు ప్రత్యక్ష సా క్షులను పోలీసులు విచారించినట్లు తెలిసింది. వా మన్‌రావు తండ్రి, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికుల నుంచి జడ్జి సమక్షంలో వివరాలు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. జడ్జి ఎదుట నిందితులను సాక్షులు గుర్తుపట్టినట్లు సమాచారం.  

40 మంది పరోక్ష సాక్షులు 
జంటహత్యల కేసుకు సంబంధించి పోలీసులు 40 మంది ఇతర సాక్షులను విచారించినట్లు తెలిసింది. ఇందులో గుంజపడుగు గ్రామస్తులతోపాటు రాజకీ య పార్టీల నేతలు, వామన్‌రావు అడ్మిన్‌గా ఉన్న వా ట్సాప్‌ గ్రూపుల సభ్యులు, బిట్టు శ్రీను, చిరంజీవి వాట్సాప్‌ గ్రూపు సభ్యులు, కొందరు రాజకీయ నేతలను కూడా విచారణ చేసి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది. విచారణలో కీలకమైన ప్రత్యక్ష సాక్షుల రక్షణకు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మంథని పోలీసులు ఇప్పటికే వామన్‌రావు తల్లిదండ్రులకు రక్షణ కల్పించారు. ప్రత్యక్ష సాక్షులను ప్రభావితం చేసే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు వారి వివరాలు గోప్యంగా ఉంచుతూనే గట్టిభద్రత కల్పించారు.  ఇక సుమారు 2 వేల పేజీలతో పోలీసులు ని వేదిక తయారు చేసినట్లు తెలిసింది. దీన్ని హై కోర్టుకు సమర్పించేందుకు కేసును పర్యవేక్షిస్తున్న రామగుండం కమిషనరేట్‌ అడిషనల్‌ డీసీపీ ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నట్లు సమాచారం.
చదవండి:  కుంట శ్రీనివాస్‌ ఆడియో క్లిప్‌.. గుడి కూలిపోతే

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top