
బోపాల్: మూడో భార్య చేతిలో హత్య గురయ్యాడు 60 ఏళ్ల వృద్ధుడు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను వదిలించుకోవాలనే ప్రణాళిక చేసిన మూడో భార్య దాన్ని ప్రియుడితో కలిసి అమలు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలోని సకారియా గ్రామంలో చోటు చేసుకుంది.
60 ఏళ్ల భయాలాల్ రజాక్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య అతని నుంచి విడిపోతే రెండో భార్యగా గుడ్డి బాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వారికి సంతానం కలగకపోవడంతో సొంత చెల్లినిచ్చి భర్తకు మూడో వివాహం చేసింది రెండో భార్య. మూడో భార్యగా మున్ని( విమ్లా) వచ్చింది. వీరి మధ్య కొన్నాళ్ల వివాహ సంబంధం బాగానే సాగింది.
ఈ క్రమంలోనే వారికి పిల్లలు కూడా కలిగారు. కానీ మూడో భార్య మున్ని.. స్థానిక ప్రాపర్టీ డీలర్ నారాయణ దాస్ కుష్‌వాహ్(లల్లూ)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి భర్త భయాలాల్ రజాక్‌ను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. దీనిలో భాగంగా ఆగస్టు 30వ తేదీ అర్థరాత్రి దాటక లల్లూ.. రజాక్‌ను హత్య చేశాడు. కిరాయి మాట్లాడుకున్న 25 ఏళ్ల ధీరజ్ కోల్‌తో కలిసి రజాక్‌ను తలపై బలంగా కొట్టి హత్య చేశారు.
ఆపై శారీలో కట్టి ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న బావిలో పడేశారు. అయితే భర్త కనిపించడం లేదని రెండో భార్య గుడ్డి భాయ్ వెతకడం ప్రారంభించిన క్రమంలో ఒక బావిలో శారీలో కట్టేసిన మూట కనిపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చెల్లి మున్నీనే చేసి ఉంటుందని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటకొచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.