గ్యాస్ట్రబుల్‌ అని వెళ్తే.. షాక్‌ ఇచ్చిన డాక్టర్‌.. ఎంత పనిచేశాడంటే?

Man Dead By Operation Failure In Kurnool - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): తనకు గ్యాస్ట్రబుల్‌ ఉందని, కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందని వైద్యుని వద్దకు వెళితే స్కానింగ్‌ చేసి అపెండిక్స్‌ ఉందని ఆపరేషన్‌ చేశాడు ఓ డాక్టర్‌. తీరా సదరు రోగి కోలుకోకపోగా ఆపరేషన్‌ వికటించి తనువు చాలించాడు. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూలులోని కొల్లాపూర్‌కు చెందిన సుమంత్‌(28) బంగారు నగలు చేసే పనిలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతనికి భార్య లావణ్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కొంత కాలంగా అతనికి కడుపు ఉబ్బరం, కడుపులో మంటగా ఉండటంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీని కలిశాడు. అతని సలహాతో కర్నూలులోని ఎన్‌ఆర్‌ పేటలో ఉన్న మెడికేర్‌ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడి ఓ సర్జన్‌ అతన్ని పరీక్షించి స్కానింగ్‌ తీయించాడు. స్కానింగ్‌లో నీకు అపెండిక్స్‌ ఉందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని, లేకపోతే కడుపులోనే అపెండిక్‌ పగిలి అపాయం కలుగుతుందని చెప్పడంతో సుమంత్‌ ఆపరేషన్‌కు ఒప్పుకున్నాడు.

దీంతో బుధవారం అతనికి సదరు ఆసుపత్రిలోనే ఆపరేషన్‌ చేశారు. అయితే రాత్రి అతనికి విపరీతమైన కడుపునొప్పి, ఆయాసం రావడంతో వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా డాక్టర్‌లు ఎవ్వరూ రాలేదని, గురువారం ఉదయం 7 గంటలకు భర్త మృతి చెందినట్లు భార్య లావణ్య చెప్పారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సుమంత్‌ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళన చేశారు.

కర్నూలు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో పాటు ఆసుపత్రి యాజమాన్యాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి ఇరువర్గాలతో రాజీ చేసినట్లు సమాచారం. కాగా సదరు ఆసుపత్రికి వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇప్పటి వరకు లభించలేదు. తాత్కాలిక అనుమతి కూడా ఆసుపత్రికి లేదని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి. రామగిడ్డయ్య తెలిపారు.
చదవండి: ప్రియుడి మైకంలో దారుణానికి ఒడిగట్టిన తల్లి..    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top