కార్యాలయంలో బీభత్సం.. భారీగా ఆస్తి నష్టం

A Man Attack On Sathiyam TV And Vandalise Furniture In Chennai - Sakshi

చెన్నె: ప్రముఖ టీవీ ఛానల్‌ కార్యాలయంలోకి దూరి ఓ వ్యక్తి ఆయుధాలతో హల్‌చల్‌ చేశాడు. కత్తి డాలు పట్టుకుని నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలో అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. దీంతోపాటు సిబ్బందిని పచ్చిబూతులు తిడుతూ బీభత్సం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నెలో చోటుచేసుకుంది.

తమిళనాడులో ప్రముఖ ఛానల్‌ సత్యం టీవీ. రోయపురం కామరాజరర్‌ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 6-7 గంటల సమయాన అకస్మాత్తుగా ఓ దుండగుడు వచ్చాడు. కత్తి, డాలు చేతపట్టి కార్యాలయంలోని రిసెప్షన్‌లో కనిపించిన వాటినన్నింటిని ధ్వంసం చేశాడు. ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లు పగులగొట్టాడు. ఒకటో అంతస్తులోని అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో హల్‌చల్‌ చేశాడు. ఆ దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్‌గా గుర్తించారు. 

దుండగుడి దాడిలో ధ్వంసమైన కార్యాలయంలో సామగ్రి

అర్ధగంటపాటు బీభత్సం సృష్టించడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని అతికష్టంగా సెక్యూరిటీ బంధించింది. సమాచారం అందుకున్న రోయపురం పోలీసులు కార్యాలయానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో ఆ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై సత్యం టీవీ ఎండీ ఇసాక్‌ లివింగ్‌స్టన్‌ స్పందించారు. ‘అతడు ఎవరో తెలియదు. ఎందుకు దాడి చేశాడో కూడా లేదు. మేం ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదు.’ అని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని ఆ ఛానల్‌ విడుదల చేసింది.

శివ కుమార్‌ కోయంబత్తూర్‌ నుంచి గుజరాత్‌కు వెళ్లాడు. నిందితుడు గుజరాత్‌ నంబర్‌ ప్లేటు ఉన్న కారుతోనే వచ్చాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారణ చేపట్టారు. కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్‌ సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా చెన్నె ప్రెస్‌ క్లబ్‌ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్‌ డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top