ఒకే యువతిపై ఇద్దరు మనసుపడ్డారు.. పేస్టులో పటాస్‌ మందు కలిపి..

Love Conflict between Two Young Men in Machilipatnam - Sakshi

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): ఇద్దరు యువకుల మధ్య ప్రేమ వివాదం కొన్ని ప్రాణాలను బలి తీసుకునే యత్నానికి దారి తీసింది. అయితే అందుకు ప్రయత్నించిన యువకుడు ఆ విషయాన్ని తన సోదరుడికి చెప్పటంతో అతడు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా చూశాడు.

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలోని ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన పాసపు నాగేంద్రకుమార్, వంకా నాగేశ్వరరావు స్నేహితులు, ఇద్దరూ రోల్డుగోల్డు పనులు చేస్తుంటారు. ఒకే కాలనీకి చెందిన వారిరువురూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై మనసు పడ్డారు.

చదవండి: (అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే..)

సదరు యువతి మొదట నాగేశ్వరరావుతో చనువుగా మెలిగింది. అయితే ఇటీవల నాగేంద్రకుమార్‌తో మాట్లాడటం మొదలు పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు ఎలాగైనా నాగేంద్రకుమార్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం సుమారు 15 రోజుల క్రితం తెలిసిన రోల్డుగోల్డు దుకాణంలో పటాస్‌ ముక్కను కొనుగోలు చేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున నాగేంద్రకుమార్‌ బాత్‌రూంలో ఉన్న టూత్‌బ్రెష్‌లపై నిందితుడు నాగేశ్వరరావు పటాస్‌ కలిపిన పేస్టును పెట్టి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.

అలా నాగేంద్రకుమార్‌ను అంతమొందించేందుకు పూనుకున్న నాగేశ్వరరావు తాను చేసిన ప్రయత్నాన్ని తన సోదరుడి చెవిన వేశాడు. నాగేశ్వరరావు సోదరుడు ఆ బ్రెష్‌లను అక్కడి నుంచి తీసి దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తరువాత ఆ నోటా ఈ నోటా విషయం కాస్తా బయటికి పొక్కటంతో విషయం తెలుసుకున్న నాగేంద్రకుమార్‌ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేంద్రకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్‌ చేసి, కోర్టుకు హాజరుపరచగా సొంత పూచీకత్తుపై నిందితుడిని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top