1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్‌

Keesara MRO Catch To ACB In Corporation - Sakshi

భూరికార్డుల్లో పేరు మార్చడం కోసం రూ.2 కోట్ల డిమాండ్‌

తొలి విడత మొత్తం 1.10 కోట్లు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన నాగరాజు

ఆయనకు సహకరించిన మరో ముగ్గురు కూడా అదుపులోకి..

సాక్షి, హైదరాబాద్‌ : కీసర రెవెన్యూశాఖలో ఓ భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్‌ ఇవ్వడం కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేశాడు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్‌ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్‌ రూ.2 కోట్ల లంచం డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఎస్‌రావు నగర్‌లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్‌కు చెం దిన శ్రీనాథ్‌ యాదవ్‌తోపాటు రాంపల్లి వీఆర్‌ఏ సాయిరాజ్‌ తహసీల్దార్‌కు సహకరించినట్లు     సమాచారం. ఈ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతోపాటు ఆయన బంధు వుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

తొలినుంచీ అవినీతి ఆరోపణలే..
తహసీల్దార్‌ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్‌పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్‌ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కీలక అధికారి విల్లా బహుమతి..
రెవెన్యూశాఖలో టైపిస్ట్‌గా చేరిన నాగరాజు పదోన్నతిపై తహశీల్దార్‌గా ఎదిగాడు. మధ్యలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. అయినా.. రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనపై ఉన్న కేసులను తొలగించుకున్నాడు. ఇప్పుడు తన లంచాల స్థాయిని ఏకంగా రూ.కోట్లకు పెంచుకున్నాడు. ఇటీవల మేడ్చల్‌ జిల్లాలోని ముగ్గురు తహశీల్దార్లు తమ అక్రమాల జోలికి రాకుండా.. ఓ కీలకాధికారికి రూ.కోట్లు విలువ జేసే విల్లాను కొనిచ్చారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో, వీరు ఎంత పెద్ద అధికారినైనా ఎలా మేనేజ్‌ చేయగలరో అర్థం చేసుకోవచ్చు.

సీఎం కార్యాలయం కన్నెర్ర..
కీసరలో ఏసీబీ దాడులపై సీఎం కార్యాలయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్‌.. రెవెన్యూశాఖ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top