24 లక్షల ప్యాకేజీ.. ఛీ ఇలాంటి పని చేశావ్‌!

IIT Hyderabad Graduate Threatened Cricketer Daughter Online: Police - Sakshi

కోహ్లిని ట్విటర్‌లో బెదిరించిన యువకుడి అరెస్ట్‌

గతంలోనూ ట్రోలింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ

నిందితుడు సంగారెడ్డి జిల్లా వాసిగా గుర్తింపు 

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది కదా అని ఏది బడితే అది టైప్‌ చేయకండి. ముఖ్యంగా సోషల్‌ మీడియాను ఫాలో అవుతున్నవారు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. మారు పేర్లు, నకిలీ ఖాతాలతో విద్వేషపు రాతలు రాసేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేసి తప్పించుకోవచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తాజాగా ఆకుబత్తిని రామ్‌నగేష్‌ అనే యువకుడు ఇలాంటి నేరంలోనే పోలీసులకు చిక్కాడు. 

సంగారెడ్డి జిల్లాకు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్‌ బెంగళూరు చెందిన ఓ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్కశర్మతో పాటు తొమ్మిది నెలల కుమార్తె వామికానూ ఉద్దేశించి ట్విటర్‌లో అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణతో ముంబై పోలీసులు రామ్‌నగేష్‌ను అరెస్ట్‌ చేశారు. టీ–20 ప్రపంచ కప్‌ భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో అతడు వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఢిల్లీ ఉమెన్‌ కమిషన్‌ సైతం తీవ్రంగా పరిగణించింది. ఈ ట్వీట్‌పై కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్‌ క్రైమ్‌ పశ్చిమ విభాగం పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్‌ క్వార్టర్స్‌లో రామ్‌నగేష్‌ పట్టుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్‌ 354(ఏ), 506, 67(బీ) కింద అభియోగాలు మోపారు. 

మారు పేరుతో ట్విటర్‌ ఖాతా... 
రాంనగేశ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్తగా ట్విట్టర్‌ ఖాతా తెరిచాడు. అది పాకిస్థాన్‌కు చెందిన ఖాతాగా నమ్మించేందుకు మార్పు చేర్పులు చేశాడు. ‘గప్పిస్తాన్ రేడియో’పేరుతో ఉన్న ట్విటర్‌ హేండిల్‌ ద్వారా కోహ్లిని బెదిరిస్తూ అక్టోబర్‌ 24న వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. దీంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు, ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం రామ్‌నగేశ్‌ పనే అని తేల్చారు. మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చిన ముంబై పోలీసులు దీనిపై సమాచారం ఇచ్చి రామ్‌నగేశ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. 

ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు
ఐఐటీ- హైదరాబాద్‌ రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేషన్‌ చేసిన రామ్‌నగేశ్‌ ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో జాబ్‌ చేశాడు. అమెరికా వెళ్లాలన్న ఉద్దేశంతో నెల క్రితమే ఉద్యోగం మానేశాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే తన కుమారుడు ఇలాంటి హేయమైన వ్యాఖ్యలు చేయడం పట్ల రామ్‌నగేశ్‌ తండ్రి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వాపోయారు. చదువులో టాపర్‌ అయిన రామ్‌నగేశ్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. 

కావాలని చేయలేదు..
అయితే రామ్‌నగేశ్‌ ఇదంతా కావాలని చేయలేదని పొరపాటున జరిగిందని శ్రీనివాస్‌ స్నేహితుడు కృష్ణమూర్తి తెలిపారు. ‘భారత్‌ మ్యాచ్‌ ఓడిపోయిందన్న బాధలో రాంనగేశ్‌ ఈ మెసేజ్‌ టైప్‌ చేశాడు. దీన్ని ట్వీట్‌ చేయాలని అతడు అనుకోలేదు. అదే సమయంలో ఫోన్‌ అతడి చేతిలో నుంచి జారిపడిపోయింది. జరిగిన నష్టాన్ని నివారించేందుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఆ మెసేజ్‌ వైరల్‌ అయింది. ఆ రోజు నుంచి రామ్‌నగేశ్‌ భయంగా రోజులు గడిపాడు. పోలీసులు వచ్చి అరెస్ట్‌ చేసే వరకు కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియదు’అని కృష్ణమూర్తి వివరించారు. 

నకిలీ ఖాతాలతో ట్రోలింగ్‌
ఫేక్‌ ప్రొఫైల్స్‌తో సోషల్‌ మీడియాలో తాము ఏం చేసినా ఎవరూ పట్టుకోలేరన్న భ్రమలు సరికాదని ముంబై సైబర్‌ క్రైమ్‌ విభాగం డీసీపీ డాక్టర్‌ రష్మి కరాండికర్‌ అన్నారు. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు అవసరమైన సాంకేతికత తమ దగ్గర ఉందని తెలిపారు. అనేక నకిలీ ఖాతాలతో రామ్‌నగేశ్‌ ట్రోలింగ్‌ చేసినట్టు గుర్తించామన్నారు. క్రిక్‌క్రేజీగర్ల్‌, రమన్‌హీస్ట్‌, పెళ్లకూతురుహియర్‌ ట్విటర్‌ హేండిల్స్‌ ద్వారా ట్రోలింగ్‌కు పాల్పడినట్టు తేల్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top