
నకిరేకల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శనివారం రాత్రి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన హనుమాన్ ప్రజాపతి (25), మహేందర్ ప్రజాపతి (26) జనరల్ స్టోర్ నడిపిస్తున్నారు.
వీరు భద్రాచలానికి చెందిన రాజు, కొత్తగూడెం నివాసి రమేశ్‌తో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. నకిరేకల్‌లోని చీమలగడ్డ ప్రాంతానికి చేరుకోగానే అదుపుతప్పిన కారు రెయిలింగ్‌ను ఢీకొట్టి ఫ్లైఓవర్ పైనుంచి (సుమారు 30 అడుగులు) కిందపడింది. మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నకిరేకల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ హనుమాన్ మరణించాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.