లీజు స్థలం అద్దెకు!

Hyderabad: 2 Cases Against BJP Leader Nanda Kumar For Cheating People - Sakshi

నందుకుమార్‌పై రెండు కేసులు 

డెక్కన్‌ కిచెన్‌ హోటల్‌ అతనిది కాదు

ఖాళీ చేస్తామన్న నిర్వాహకులకు బెదిరింపులు

పీటీ వారెంట్‌పై అరెస్టుకు పోలీసుల నిర్ణయం

హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌): ఫిల్మ్‌నగర్‌లో ఉన్న డెక్కన్‌ కిచెన్‌ హోటల్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్‌ది కాదని, లీజుకు తీసుకున్న స్థలం తనదే అంటూ ఇద్దరికి అద్దెకు ఇచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అతనిపై సోమవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సినీ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్‌ బాబులకు ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నం.1లో ఉన్న స్థలాన్ని నందుకుమార్‌ లీజుకు తీసుకున్నాడు.

దీనిపై వీరి మధ్య న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. కాగా ఇందులో ఉన్న డెక్కన్‌ కిచెన్‌ హోటల్‌ తనదే అంటూ నందు ఇప్పటివరకు ప్రచారం చేసుకున్నాడు. కానీ ఈ హోటల్‌ వాస్తవానికి మహేంద్రహిల్స్‌కు చెందిన సయ్యద్‌ ఎజాజ్, సయ్యద్‌ అజర్, వినయ్‌ గవనే, కౌశిక్‌ కన్నం ఏర్పాటు చేసినట్లు ఈ కేసులతో వెలుగులోకి వచ్చింది. 

తన స్థలమేనని చెప్పి 3 వేల గజాలు..
మరోవైపు లీజుకు తీసుకున్న స్థలాన్ని అక్రమంగా వేరొకరికి అద్దెకు ఇవ్వాలని భావించిన నందు.. 2021 జూన్‌లో టేస్టీ వెల్‌ హాస్పిటాలిటీ సంస్థను నిర్వహిస్తున్న ఎజాజ్‌ తదితరులను సంప్రదించాడు. అది తన స్థలమేనని చెప్పాడు. ఈ క్రమంలో 3 వేల చదరపు అడుగులు అద్దెకు తీసుకోవడానికి అంగీకారం కుదిరింది. రూ.12 లక్షల అడ్వాన్సు, నెలకు రూ.2 లక్షల అద్దెతో పాటు హోటల్‌ నెలవారీ వ్యాపారంలో 10 శాతం కమీషన్‌ నందుకు ఇచ్చేలా మౌఖిక ఒప్పందం కుదిరింది.

దీంతో ఎజాజ్‌ తదితరులు నందుకు రూ.6 లక్షల నగదు, అతడికి చెందిన డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు రూ.6 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించారు. తర్వాత రూ.65 లక్షలు వెచ్చించిన ఎజాజ్‌ తదితరులు ఆ స్థలంలో డెక్కన్‌ కిచెన్‌ ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్‌ నుంచి అద్దె, కమీషన్‌ చెల్లిస్తున్నారు. అయితే ఈ స్థలాన్ని నందు లీజుకు తీసుకున్నాడని, లీజు అగ్రిమెంట్‌ ప్రకారం వేరే వారికి అద్దెకు ఇవ్వకూడదని ఎజాజ్‌ తదితరులకు ఈ ఏడాది జూలైలో తెలిసింది. దీంతో తాము డెక్కన్‌ కిచెన్‌ హోటల్‌ ఖాళీ చేస్తామంటూ నందుకు చెప్పగా బెదిరింపులు ఎదురయ్యాయి. వీళ్లు చేపట్టిన అదనపు నిర్మాణాలను ఆదివారం జీహెచ్‌ఎంసీ కూల్చివేయడంతో..ఎజాజ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు.

గాడ్జెట్‌ స్టూడియో నిర్వాహకుడికీ అద్దెకు..
ఇదే స్థలంలో మరో పక్కన ఉన్న 700 చదరపు అడుగుల స్థలాన్ని నందు ఈ ఏడాది మార్చిలో కోకాపేట ప్రాంతానికి చెందిన మిట్టా సందీప్‌ కుమార్‌కు నెలకు రూ.1.5 లక్షల అద్దె, రూ.12 లక్షల అడ్వాన్సుకు అద్దెకు ఇచ్చాడు. గాడ్జెట్‌ స్టూడియో పేరుతో మొబైల్‌ యాక్ససరీస్‌ వ్యాపారం చేసే సందీప్‌కు నగర వ్యాప్తంగా ఏడు ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. కాగా సందీప్‌ ఆ స్థలంలో రూ.50 లక్షలు వెచ్చించి షోరూమ్‌ ఏర్పాటు చేశారు.

ఆదివారం నాటి కూల్చివేతల్లో ఇది కూడా నేలమట్టమైంది. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆయన కూడా బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నందును ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించిన బంజారాహిల్స్‌ పోలీసులు ఆ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్లాట్‌ను స్వాధీనం చేసుకున్న రానా
ఆదివారం జీహెచ్‌ఎంసీ కూల్చివేతల నేపథ్యంలో.. తమకు సంబంధించిన ప్లాట్‌ను దగ్గుబాటి సురేష్‌ కుమారుడు, సినీ నటుడు రానా తన అధీనంలోకి తీసుకున్నారు. రానా ప్లాట్‌ పక్కనే దగ్గుబాటి వెంకటేష్‌ ప్లాట్‌ ఉంది. ఇందులో డెక్కన్‌ కిచెన్‌ హోటల్‌తో పాటు బరిస్టా కేఫ్‌ కొనసాగుతోంది. కోర్టు స్టే ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ప్లాట్‌ జోలికి వెళ్ళలేదు. మరోవైపు హైకోర్టు స్టే ఉన్న తర్వాత కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్మాణాలు కూల్చివేశారంటూ నందుకుమార్‌ భార్య చిత్రలేఖ, కుమారుడు అనీష్‌ తేజ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top