ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారి దుర్మరణం

HYD: Three Year Old Dies In Road accident at Tank Bund - Sakshi

ఎదురెదురుగా ఢీ కొన్న కారు–ప్రైవేట్‌ బస్సు

అక్కడికక్కడే కన్నుమూసిన రెండేళ్ల చిన్నారి

తల్లిదండ్రులు, డ్రైవర్‌కు సైతం గాయాలు

సాక్షి, హైదరాబాద్‌​:  ఓ డ్రైవర్‌ నిద్రమత్తు చిన్నారిని చిదిమేసింది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గుండెకోత మిగిల్చింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులు, డ్రైవర్‌ కూడా క్షతగాత్రులయ్యారు. బుధవారం తెల్లవారుజామున ట్యాంక్‌బండ్‌పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన దుస్సా శివకుమార్‌ (40) నగరంలోని నిర్మాణ సంస్థలో మేనేజర్‌ కాగా ఈయన భార్య సమత (36) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. రాయదుర్గంలో నివసిస్తున్న వీరికి చిన్నారి సిరి (రెండేళ్లు పూర్తి) ఉంది. రైలులో కుటుంబంతో సహా బెల్లంపల్లి వెళ్లడానికి శివకుమార్‌ బుధవారం తెల్లవారుజామున క్యాబ్‌ (టీఎస్‌ 08 యూజీ 1939) బుక్‌ చేసుకున్నారు. రాయదుర్గం నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వస్తున్న వీరి క్యాబ్‌కు కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీకి చెందిన కౌశిక్‌ డ్రైవర్‌గా ఉన్నారు.

ఈ వాహనం తెల్లవారుజాము 4.30 గంటకు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుంది. అదే సమయంలో ఈ వాహనానికి వ్యతిరేక దిశలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు (ఎంహెచ్‌ 34 బీజీ 2877) వస్తోంది. ఈ బస్సు తన ముందు ఉన్న కారును ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నంలో కుడి వైపునకు వచ్చింది. ఫలితంగా బస్సు ముందు కుడివైపు భాగంలో కారు ముందు కుడివైపు భాగం బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో క్యాబ్‌ డ్రైవర్‌ కౌశిక్, వెనుక సీటులో కూర్చున్న శివకుమార్, సమతలకు తీవ్ర గాయాలు కాగా.. చిన్నారి సిరి అక్కడికక్కడే కన్ను మూసింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి, క్షతగాత్రులపై ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. 

అది డబుల్‌ లైన్‌ రోడ్‌... 
రహదారికి మధ్యలో అనేక రకాలైన గీతలు కనిపిస్తుంటాయి. ఒక్కో గీతకు ఒక్కో అంశానికి సూచికగా నిబంధనలు చెప్తుంటాయి. రోడ్డు మధ్యలో రెండు గీతలు పక్కపక్కనే ఉంటే దాన్ని డబుల్‌ లైన్‌ అంటారు. అలాంటి రహదారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌ టేకింగ్‌ చేయకూడదని అర్థం. ఒక గీత ఉండే దాన్ని సింగిల్‌ లైన్‌ అంటారు. దీనిపై ఓవర్‌ టేకింగ్‌ నిషిద్ధం. దూరందూరంగా ఉండే గీతలతో కూడిన బ్రోకెన్‌ లైన్‌ ఉన్న మార్గంలో మాత్రమే ఎదుటి వా హనాల పరిస్థితిని బట్టి ఓవర్‌ టేక్‌ చెయ్యాలి. ట్యాంక్‌బండ్‌ డబుల్‌ లైన్‌ రోడ్‌. అయినప్పటికీ బస్సు డ్రైవర్‌ ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నించడం, నిద్రమత్తు ఈ ప్రమాదాలకు కారణమయ్యాయి.  

గత నెలలోనే రెండో పుట్టినరోజు 
శివకుమార్‌కు ఛాతి, తల భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. సమతకు రెండు చేతులూ విరిగిపోగా, తల, తుంటి భాగాల్లోనూ గాయాలయ్యాయి. కౌశిక్‌ ఎడమ చేయి విరగ్గా..ముఖం మీదా గాయాలయ్యాయి. శివకుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. శివకుమార్‌ బావ జగదీష్‌ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు. శివకుమార్, సమతలకు వివాహమైన పదేళ్లకు సిరి జన్మించింది. గత నెల 15నే చిన్నారి రెండో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే ఇంతటి విషాదం చోటు చేసుకోవడంతో వారి   బంధుమిత్రులు దుఖసాగరంలో మునిగిపోయారు.   
చదవండి: 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top