
హైదరాబాద్: జీవో నంబర్ 111 అంశానికి సంబంధించి ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి నాలుగేళ్లయినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు నిలదీసింది. ఈ జీవోపై గురువారం విచారణ సందర్భంగా.. అసలు నివేదిక జాప్యం వెనక రహస్య అజెండా ఏంటని సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, దీనిపై ప్రభుత్వ అదనపు ఏజీ రామచంద్రరావవు.. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని వివరణ ఇచ్చారు.
దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం.. ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సెప్టెంబర్ 13 లోగా ఇవ్వాలని సూచించింది. ఒకవేళ నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈపీటీఆర్‌ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని కమిటీకి ఆదేశించింది. నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టాలని కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
చదవండి: Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్ మరో మాట!