‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’

Government Employee Intimidated A man With Gun In Ananthagiri - Sakshi

అనంతగిరి: బాధ్యతగల ఓ ప్రభుత్వోద్యోగి ఓ వ్యక్తిని ఎయిర్‌గన్‌తో బెదిరించిన సంఘటన శుక్రవారం రాత్రి వికారాబాద్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. పట్టణంలోని సాకేత్‌నగర్‌లో నివసించే షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌ కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కమలానగర్‌కు చెందిన ప్రణీత్‌కుమార్‌ అనే వ్యక్తి గౌలికార్‌ ఫంక్షన్‌ హాల్‌ వెనక ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన కోసం ఆగగా.. ఫయాజ్‌ అహ్మద్‌ వచ్చి పరుష పదజాలంతో తిట్టాడు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’అంటూ కారులో నుంచి తుపాకీ తీసి బెదిరించాడు.

దీంతో ప్రణీత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఫయాజ్‌ అహ్మద్‌ ఇంట్లో వెతకగా ఎయిర్‌గన్‌తో పాటు తల్వార్, కత్తులు దొరికాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్, మారణాయుధాలు ఎక్కడివని ఆరా తీశారు. అతని ఇండికా కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించామని సీఐ రాజశేఖర్‌ తెలిపారు. కాగా, ఫయాజ్‌ అహ్మద్‌ వద్ద అసలైన తుపాకీ ఉందని, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తు్తన్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
చదవండి: Banjara Hills: సహజీవనం.. విషాదం 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top