బలవంతం చేస్తే దొంగచాటుగా తాళికట్టాడు.. కానీ

Girl Eliminated Man Over Cheating Her West Godavari District - Sakshi

బలవంతం చేస్తే తాళికట్టి.. బహిరంగ పెళ్లికి నిరాకరణ

మనోవేదనతో ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన యువతి

కొవ్వూరు: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తాళికట్టాడు. బహిరంగ పెళ్లికి నిరాకరించాడు. పైగా అనుమానంతో ప్రేయసిపై వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం ఆరంభించాడు. ఈ మోసాన్ని, అవమానాన్ని భరించలేక ఆ నయవంచకుడిని యువతి  కత్తితో పొడిచి హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు..  తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గర్సికూటి పావని  కొవ్వూరు ఏబీఎన్‌ అండ్‌ పీఆర్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే తాడేపల్లిగూడెంలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో అంబటి కరుణ తాతాజీనాయుడు అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. 

కొన్నాళ్లపాటు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి.. కులాలు వేరు కావడంతో అతడు పెళ్లికి నిరాకరించాడు. అయితే యువతి ఒత్తిడి చేయడంతో దొంగచాటుగా తాళి కట్టాడు. కొంతకాలం సహజీవనం కూడా చేశాడు. ఈ క్రమంలో.. అధికారికంగా అందరిముందు తనను పెళ్లి చేసుకోవాలని పావని కోరగా అందుకు ససేమిరా అన్నాడు. అంతేగాకుండా పావనిపై అనుమానం పెంచుకుని, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడి వేధింపులు తాళలేక యువతి తన స్వగ్రామమైన మలకపల్లి వచ్చేసింది. సోమవారం యువతికి ఫోన్‌ చేసి మాట్లాడే పని ఉందని ఐ.పంగిడి జంక్షన్‌కి రావాలని తాతాజీనాయుడు కోరాడు. దీంతో పావని అక్కడికి వచ్చింది. (చదవండి: ప్రేమ విఫలం.. యువకుడి బలవన్మరణం)

అనంతరం ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడంతో తనను ఇంటి దగ్గర దింపి రావాలని కోరడంతో మోటారు సైకిల్‌పై బయల్దేరారు. అయితే అప్పటికే  అతడి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన చాకుతో అతడిపై దాడి చేసింది. ధర్మవరం గ్రామ శివారుకు వచ్చేసరికి తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. దీంతో మోటారు సైకిల్‌ పైనుంచి అతడు పడిపోవడంతో పలుచోట్ల కత్తితో కసిదీరా పొడిచింది. ఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పావని పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి లొంగిపోయింది. రూరల్‌ ఎస్‌ఐ కె.రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top