విలేకరి పేరుతో రూ.7 లక్షలకు టోకరా..

Fake Reporter Mystery In Nizamabad - Sakshi

సాక్షి, లింగంపేట (నిజామాబాద్): విలేకరి పేరుతో ఏకంగా రూ.7 లక్షలకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం కొట్టాల్‌ గ్రామానికి చెందిన ఆలకుంట మంజుల, రాములు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాములు మృతి చెందాడు. అయితే, లింగంపేట గ్రామానికి చెందిన సాయికృష్ణ తాను విలేకరినని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని నమ్మబలికి ఖర్చుల నిమిత్తం రూ.70 వేలు తీసుకున్నాడు. అలాగే, యాక్సిడెంట్‌ కేసులో రూ.12 లక్షలు రాగా, అందులో మంజులకు రూ.4 లక్షలు, ఆమె అత్తమ్మ హన్మవ్వకు రూ.లక్ష ఇచ్చాడు. మిగతా రూ.7 లక్షలు బాధితులకు ఇవ్వకుండా దగ్గర పెట్టుకున్నాడు.

బాధితులు అడిగితే రేపు, మాపు అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడని బాధితులు గురువారం విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి తాము పుట్టెడు దుఃఖంలో ఉంటే, తమను నమ్మించి నిలువునా మోసం చేశాడని వాపోయారు. సాయికృష్ణను డబ్బులు అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం కామారెడ్డిలో నివాసముంటున్న సాయికృష్ణ నుంచి తమకు డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని మంజుల విజ్ఞప్తి చేశారు. 

చదవండి: అమానుషం: వృద్ధుడిని చాపలో చుట్టి పడేశారు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top