వివాహేతర సంబంధం.. బ్లేడుతో గొంతుకోసి | Extra Marrital Affiar Woman Brutally Murdered In Bhuvanagiri | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం..మహిళ హత్య

Nov 13 2020 8:02 AM | Updated on Nov 13 2020 8:24 AM

Extra Marrital Affiar Woman Brutally Murdered In Bhuvanagiri - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భువనగిరిఅర్బన్‌ : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన భువనగిరి శివారులోని వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన గుట్టల్లో చోటుచేసుకుంది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమాడురు గ్రామానికి చెందిన లక్ష్మి(35) భర్త కొంత కాలం క్రితం మృతిచెందాడు. అనంతరం హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న కుమార్‌ అనే వ్యక్తితో పరిచడం ఏర్పడింది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో లక్ష్మికి మహబూబ్‌నగర్‌కు చెందిన విజయ్‌ అనే యువకుడితో కూడా సంబంధం ఉన్నట్లు కుమార్‌ అనుమానించాడు.

ఈ విషయాన్ని ఎన్నోసార్లు లక్ష్మిని అడిగేందుకు ప్రయత్నించినా కుదరలేదు. విషయాన్ని తేల్చుకోవాలని కుమార్‌ భావించాడు. అది నిజమని తెలిస్తే హతమార్చాలని కూడా ముందుగానే నిర్ణయించుకొని బ్లేడును వెంట తీసుకెళ్లాడు. బుధవారం లక్ష్మి, కుమార్‌ ఇద్దరూ కలిసి భువనగిరి బైపాస్‌ పక్కన ఉన్న ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అనంతరం కుమార్‌ తనకున్న అనుమానం గురించి లక్ష్మిని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కుమార్‌ అక్కడే ఉన్న బండరాయితో లక్ష్మి తలపై దాడి చేశాడు. అలాగే తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌ తీసుకొని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నేరుగా భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కుమార్‌ లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు డీసీపీ నారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న బీరు బాటిళ్లు, కూల్‌ డ్రింక్, బిర్యానీ ప్యాకెట్, ఒక బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement