బిగ్‌షాట్‌లే టార్గెట్: కిడ్నాపులు, హత్యలే అతడి నైజం

సాక్షి, అమలాపురం టౌన్: కోటీశ్వరులను ఎంచుకుని అతడు తొలుత బెదిరింపులకు పాల్పడతాడు. దారికి రాకపోతే కిడ్నాపులు చేస్తాడు. దానికీ దిగిరాకపోతే హత్యలకు సైతం తెగబడతాడు. ఐ.పోలవరం మండలానికి చెందిన త్రినాథవర్మ ఒకటిన్నర దశాబ్దాల నేర చరిత్ర ఇది. గత నెలలో రావులపాలెంలోని ఓ ఫైనా న్స్ వ్యాపారి ఇంటి వద్ద తుపాకితో కాల్పులకు తెగబడ్డ ఘటనలో ఇతడే ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. రెండు రోజుల కిందట అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. పోలీసు రికార్డుల ప్రకారం ఒకటిన్నర దశాబ్దాల కాలంలో త్రినాథవర్మ రెండు హత్యలు, నాలుగు కిడ్నాపులకు పాల్పడ్డాడు.
2011 ఆగస్టు 28న అమలాపురంలో ఆక్వా రైతు కేవీ సత్యనారాయణరాజును డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. శ్రీశైలం అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి సత్యనారాయణరాజుకు సజీవదహనం చేశాడు. సాక్ష్యాధారాలు మా యం చేశాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో ధనికుడిని డబ్బుల డిమాండ్ చేశాడు. చివరకు అతడి ని కూడా కిడ్నాప్ చేసి, హతమార్చాడు. అప్పట్లో ఈ కేసు అమలాపురంలో సంచలనం రేపింది. డబ్బుల డిమాండ్ చేస్తూ బెదిరింపులు, కిడ్నాప్‌లకు సంబంధించి త్రినాథవర్మపై నాలుగు కేసులు ఉన్నాయి.
డబ్బుల కోసమే రావులపాలెం కాల్పులు
రావులపాలెంలో పైనాన్షియర్ గుడిమెట్ల వెంకట సత్యనారాయణరెడ్డి (కాటా బాస్) కుమారుడు ఆదిత్యరెడ్డిని కూడా బెదిరించి డబ్బులు గుంజాలనే లక్ష్యంతోనే గత నెల ఐదున త్రినాథవర్మ గ్యాంగ్ వెళ్లింది. ఆదిత్యరెడ్డి అనూహ్యంగా ఎదురు తిరగడంతో దుండగులు తుపాకి కాల్పులకు తెగబడ్డారు. ఈ తరహా నేరాలకు త్రినాథవర్మే సూత్రధారి అని, అతడి అనుచరులు పాత్రధారులని పోలీసులు చెబుతున్నారు.
పోలీసు తనిఖీల్లో వర్మ రెండుసార్లు తుపాకులతో పట్టుబడ్డాడు. రావులపాలెం కాల్పుల ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ వై.మాధవరెడ్డి, రావులపాలెం ఇన్‌చార్జి సీఐ డి.ప్రశాంతకుమార్‌లు ఈ కేసులో తీగ లాగారు. దీంతో త్రినాథవర్మ నేరాల డొంక కదిలింది. అతడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు.